టిటిడిపి నేత రేవంత్ రెడ్డికి ఈరోజు శాసనసభ ఆవరణలో చాలా వింత అనుభవాలు ఎదురయ్యాయి. అయనను తెదేపా పదవుల నుంచి తప్పించిన కారణంగా ఈరోజు ఎల్పి సమావేశం నిర్వహించవద్దని టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ ఎస్.ఎం.ఎస్. పంపించారు. దానిని అవమానంగా భావించిన రేవంత్ రెడ్డి తెదేపా ఛాంబర్ లో ఎల్పి నేతగా తనకు కేటాయించిన కుర్చీలో కూర్చోకుండా పక్కన వేరే కుర్చీలో కూర్చొన్నారు. ఇంతకాలం ఆయన వెన్నంటి తిరిగిన తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శాసనసభకు వచ్చినప్పటికీ ఆయనను పలుకరించకుండా నేరుగా బిఎసి సమావేశానికి హాజరయ్యారు. మరోపక్క రేవంత్ రెడ్డిని పార్టీలో నుంచి బహిష్కరించడం ఖాయం అని అధ్యక్షుడు ఎల్ రమణ మీడియా చెపుతుండటం మరీ అవమానకరంగా మారింది.
మళ్ళీ అంతలోనే దీనికి పూర్తిభిన్నమైన పరిస్థితి రేవంత్ రెడ్డికి ఎదురైంది. శాసనసభ ప్రాంగణంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంపత్, షబ్బీర్ అలీ ఎదురైనప్పుడు, వారు ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి ‘వెల్ కమ్’ అని చెప్పి ఆప్యాయంగా కౌగలించుకొని చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళిపోయారు. ఒకపక్క తెదేపా పొమ్మంటుంటే మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఆప్యాయంగా రమ్మంటోంది. ఒకేసమయంలో రెండు విభిన్నమైన అనుభవాలను చవిచూడటం విశేషమే కదా?