తెలంగాణా శాసనసభ సమావేశాలు 50 రోజులు..గ్రేట్!

రేపటి నుంచి తెలంగాణా శాసనసభ, మండలి సమావేశాలు మొదలవబోతునందున, ఈరోజు అధికార, ప్రతిపక్ష సభ్యులతో కూడిన బిఎసి సమావేశం జరిగింది. ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, చిన్నారెడ్డి, కిషన్ రెడ్డి, సండ్రవెంకట వీరయ్య పాల్గొన్నారు.

ఈసారి సమావేశాలను 50 రోజులపాటు నిర్వహించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనకు బిఎసి ఆమోదం తెలిపింది. శని,ఆదివారాలు, నవంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు మూడు రోజులు ఉభయ సభలకు శలవులుగా నిర్ణయించారు. సమావేశాలు 50 రోజుల పాటు నిర్వహిస్తునందున రోజూ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. రోజూ గంటసేపు సాగే ప్రశ్నోత్తరాల సమయాన్ని గంటన్నరకు పెంచారు. మొదటిరోజున కేవలం ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించి సభను వాయిదా వేయాలని నిర్ణయించారు. 

శాసనసభ సమావేశాలను అవసరమైతే 100 రోజులు ఏకధాటిగా నిర్వహించి, బడ్జెట్ సమావేశాలను కూడా కలుపుకుపోదామని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కానీ మొదట 50 రోజుల సమావేశాలు పూర్తయిన తరువాత, మళ్ళీ బిఎసి సమావేశం నిర్వహించి పొడిగింపుపై తగిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. 

రేపు ఉభయసభలు మొదలయ్యే ముందు మళ్ళీ మరోసారి బిఎసి సమావేశం నిర్వహించి, సభలో చర్చించవలసిన అంశాల అజెండాను ఖరారు చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ రేపు ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం పెట్టుకొంది కనుక రేపటి సమావేశంలో అది పాల్గొనదు. 

సాధారణంగా శాసనసభ సమావెశాలంటే అధికార పార్టీలకు కాస్త ఇబ్బందికరంగానే భావిస్తుంటాయి. కానీ అందుకు భిన్నంగా తెరాస సర్కార్ 50-100 రోజులు సమావేశాలు నిర్వహించదానికి సిద్దపడటం హర్షణీయమే. కానీ శాసనసభ సమావేశాలు సుదీర్ఘకాలం సాగినట్లయితే, మంత్రులు, ప్రజా ప్రతినిధులు దానిలో పాల్గొనవలసి ఉంటుంది కనుక పాలన కుంటుపడే ప్రమాదం ఉంటుంది. కనుక 50 రోజులకే పరిమితం చేయడం మంచిది.