తెదేపా నేతలకు రేవంత్ రెడ్డి షాక్

తెలంగాణా తెదేపా నేతలకు ఆ రేవంత్ రెడ్డి మళ్ళీ ఈరోజు మరో షాక్ ఇచ్చారు. ఒకపక్క కాంగ్రెస్ పార్టీలోకి మారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకొంటూనే, గురువారం ఉదయం శాసనసభలో గల తెదేపా ఛాంబర్ లో తెదేపా లెజిస్లేటివ్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి సిద్దం అవుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభా పక్ష నేత హోదాలో పార్టీలో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్యకు, ఆర్. కృష్ణయ్యకు, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ తదితరులకు లేఖలు వ్రాసి  ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా కోరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నయిన తనను ఈ సమావేశం జరుపకుండా ఎవరూ అడ్డుకోలేరని రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం. 

ఒకవేళ ఆయన నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ఎవరైనా హాజరైనట్లయితే, వారు ఆయనతో కలిసి పార్టీ వీడటానికి సిద్దంగా ఉన్నారని చాటి చెప్పినట్లవుతుంది. కనుక ఈ సమావేశానికి ఎవరైనా హాజరవుతారో లేదో చూడాలి. ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య పేరు కూడా ఉంది కనుక ఆయన రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళతారో లేదో రేపు తేలుతుంది. ఇక ఆర్. కృష్ణయ్య పేరుకే తెదేపా ఎమ్మెల్యే కానీ అయన తెదేపాకు ఎప్పుడో దూరం అయ్యారు. కనుక ఆయన ఈ సమావేశానికి హాజరైనా కాకపోయినా తేడా ఉండదు.  

తెదేపా అధినేత, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు విదేశీయాత్ర ముగించుకొని బుధవారం రాత్రికి విజయవాడ చేరుకోనున్నారు. కనుక రేవంత్ రెడ్డి వ్యవహారంపై రేపు ఆయన తుది నిర్ణయం తీసుకోవచ్చు.