హావాలా కేసులో షబ్బీర్ అలీ?

తెలంగాణా రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నేత, శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ హవాలా కేసులో ఈడి నోటీసులు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ హయంలో హవాల కేసులలో ఇరుకొన్న కొంతమంది ప్రముఖులపై కేసులు మాఫీ చేయించడం కోసం ఆయన వారి తరపున ఆనాటి సిబిఐ డైరెక్టర్లకు లంచాలు చేరవేసినట్లు ఆరోపిస్తూ ఈడి ఆయనకు సోమవారం నోటీసు జారీ చేసినట్లు ఆ వార్తల సారాంశం.  

ఈ కేసులో ఇరుకొన్న హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థకు చెందిన సుఖేష్ గుప్తాను వాటి నుంచి తప్పించేందుకు షబ్బీర్ అలీ, హైదరాబాద్ కే చెందిన సతీష్ సనా అనే మరో వ్యాపారితో కలిసి డిల్లీ వెళ్ళి అక్కడ మొయిన్ ఖురేషి అనే మాంసం ఎగుమతిదారు ద్వారా సిబిఐ  డైరెక్టర్లకు రూ.1.5 కోట్లు లంచం ముట్టజెప్పారని ఆ వార్తలలో పేర్కొనబడింది. 

ఈ వార్తలపై షబ్బీర్ అలీ స్పందిస్తూ, “నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఈ కేసులో నాపై మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. నాకు ఈడి, సిబిఐల నుంచి ఇంతవరకు ఎటువంటి నోటీసులు రాలేదు. ఒకవేళ వస్తే వాటిని తప్పకుండా మీడియాకు చూపిస్తాను. ఒకవేళ నోటీసులు అందితే ఈడి ముందు హాజరయ్యి నా వివరణ ఇస్తాను. దర్యాప్తుకు సహకరిస్తాను. మీడియా చెపుతున్న ఆ మొయిన్ ఖురేషి ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ కలువలేదు..కనీసం చూడలేదు. సుఖేష్ గుప్తా మా ఫ్యామిలీ ఫ్రెండ్ కనుక ఆయనతో నాకు మంచి పరిచయం ఉంది,” అన్నారు షబ్బీర్ అలీ.