ఇంతకీ కోమటిరెడ్డి ఎవరికి సవాలు విసురుతున్నాడు?

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం నల్లగొండలో తన అనుచరులతో సమావేశమయ్యారు. యధాప్రకారం ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగిన తరువాత, ముఖ్యమంత్రి రాష్ట్రంలో రైతుల కష్టాలను పట్టించుకోనందుకు నిరసనగా అక్టోబర్ 27న ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆ రోజు శాసనసభను 10,000 మంది రైతులతో ముట్టడించడం ఖాయం అని ప్రకటించారు. 

దీని కోసం పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డితో మాట్లాడుతానని, ఒకవేళ ఆయన అంగీకరించకపోతే వ్యక్తిగతంగా నల్లగొండ ప్రజలు, రైతుల తరపున శాసనసభ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తానని ప్రకటించారు. 

సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలను పార్టీ తరపునే నిర్వహిస్తుంటారు తప్ప వ్యక్తిగతంగా నిర్వహించరు. ఒకవేళ నిర్వహించినా అది జిల్లా లేదా నియోజక వర్గానికే పరిమితం చేసుకొంటారు. కానీ కోమటిరెడ్డి ముందుగా పార్టీ అనుమతి తీసుకోకుండానే తన కార్యాచరణను ప్రకటించేశారు. పార్టీ అనుమతించకపోయినా వ్యక్తిగతంగా నిర్వహిస్తానని ప్రకటించేశారు. 

దీనితో ఆయన తెరాస సర్కార్ పై పోరాటం చేస్తున్నారా లేక పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డితో  చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. తాను ప్రకటించిన ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తారా..లేదా? అని ఉత్తం కుమార్ రెడ్డి పీక మీద కత్తి పెట్టి అడుగుతున్నట్లుంది. 

ఒకవేళ దీనికి అనుమతి నిరాకరిస్తే ఆయన తప్పకుండా ఉత్తం కుమార్ రెడ్డిపై మళ్ళీ విమర్శల వర్షం కురిపించడం ఖాయం. అనుమతిస్తే తన వెనుక ఉత్తం కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలందరినీ నడిపించుకొన్నట్లవుతుంది. కనుక దీని వలన తెరాస సర్కార్ కలిగే ఇబ్బంది కంటే కాంగ్రెస్ పార్టీకి కలిగే ఇబ్బందే ఎక్కువ. కోమటిరెడ్డి పెడుతున్న ఈ అగ్నిపరీక్షను ఉత్తం కుమార్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో బహుశః రేపు తెలియవచ్చు.