రేవంత్ రెడ్డి తిరుగుబాటుతో టిటిడిపిలో తలెత్తిన సంక్షోభం కారణంగా శాసనసభ సమావేశాలకు ముందు టిటిడిపి లెజిస్లేటివ్ సమావేశం కూడా నిర్వహించలేని దుస్థితి ఏర్పడింది. టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ ఈ విషయం స్వయంగా మీడియాకు చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అందుబాటులో లేకపోవడం వలన ఆయన వచ్చే వరకు ఎదురుచూడక తప్పదు. ఈలోగా మళ్ళీ మరోసారి పార్టీ నేతలందరితో మాట్లాడి వారి అభిప్రాయలు కూడా తీసుకొంటానని రమణ చెప్పారు.
పార్టీలో మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలియని పరిస్థితి దాపురించిందని రమణ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే రేవంత్ రెడ్డితో ఎంతమంది నేతలు వెళ్ళిపోబోతున్నారో తెలియడం లేదని ఆయన చెపుతున్నట్లు భావించవచ్చు. ఈనెల 26న శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. మరుసటి రోజు నుంచి శాసనసభ, మండలి సమావేశాలు మొదలవుతాయి. ఈ సమయంలో టిటిడిపికి ఇటువంటి పరిస్థితి ఎదురవడం అనూహ్యమైన పరిణామమే అని చెప్పవచ్చు. ఈ గండాన్ని తెదేపా అధిగమించగలదా లేదా అనేది రానున్న రోజులలో చూడవచ్చు.