రూ.7 లక్షల కోట్ల ప్రాజెక్టుకు లైన్ క్లియర్

ఈరోజు డిల్లీ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో చాలా బారీ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేశారు. భారత్ మాల పేరుతో దేశవ్యాప్తంగా కొత్తగా 83,000 కిమీ పొడవునా జాతీయ రహదార్లను నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం సుమారు రూ.7 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. వచ్చే ఐదేళ్ళలో కనీసం 40,000 కిమీ హైవే రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకొన్నారు. దీని కోసం ఐదేళ్ళలో రూ.3.5 లక్షల కోట్లు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సరుకు రవాణా కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 21,000 కిమీ పొడవుగల ఎకనామిక్ కారిడార్లను నిర్మించాలని గతంలో అనుకొంది. కానీ వాటితో కలిపి ఈ భారత్ మాల ప్రాజెక్టులో ఆ సంఖ్యను 44 పెంచింది. 

ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలో సరుకు రవాణా రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. వివిధ రాష్ట్రాల గుండా సాగే ఈ హైవే ప్రాజెక్టు వలన, ఆయా ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాజెక్టులు నిర్మాణ పనులలో ఆయా ప్రాంతాలలో వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మౌలికవసతులు అభివృద్ధి చెందితేనే ఏ దేశమైనా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి అమెరికా, యూరోప్, చైనా తదితర దేశాలు మన కళ్ళముందు ప్రత్యక్ష ఉదాహరణలుగా కనబడుతున్నాయి. కనుక భారత్ కూడా ఆ దిశలో తొలి అడుగు వేస్తోంది కనుక ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్ పరిస్థితులలో గణనీయమైన మార్పులు కనబడే అవకాశాలున్నాయి.