టి-బిజెపి నిరాశ చెందిందా?

టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎప్పటికైనా భాజపాలో చేరుతారనుకొంటే ఆయన కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గారు. తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా ఆయన ఆ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. కనుక ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి-తెదేపా-కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినది మాత్రమే అనుకోవలసి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి నిర్ణయంతో కంగు తిన్న భాజపా నేరుగా ఆ మాట చెప్పలేక రేవంత్ రెడ్డిపై రుసరుసలాడుతోంది.

తెలంగాణా భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు మాత్రమే ఉన్నాయని అనడం సరికాదు. దానర్ధం రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేవని ఆయన (రేవంత్ రెడ్డి) భావిస్తున్నట్లున్నారు. అయన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారేందుకు సిద్దపడుతూ, ప్రతిపక్షాల గురించి చులకనగా మాట్లాడటం సరికాదు. ఎవరు కలిసినా కలువకున్నా మేము మాత్రం తెరాస సర్కార్ అప్రజాస్వామిక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాము. వచ్చే ఎన్నికలలో మేము ఒంటరిగానే పోటీ చేస్తాము,” అని అన్నారు. 

ఒకవేళ రేవంత్ రెడ్డి భాజపాలో చేరేందుకు ఆసక్తి చూపి ఉండి ఉంటే, ఆయనను భాజపా సాదరంగా ఆహ్వానించి సముచిత గౌరవం ఇచ్చి ఉండేది. 

తెదేపాకు భాజపా మిత్రపక్షమే కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి భాజపాలో చేరదలచుకొని ఉండి ఉంటే చంద్రబాబు నాయుడుకి, తెదేపా నేతలకు కూడా పెద్ద అభ్యంతరం ఉండేది కాదేమో? వచ్చే ఎన్నికలలో తెదేపా, భాజపా, తెరాసలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మోత్కుపల్లి నరసింహులు ఈమధ్యనే సూచించిన సంగతి తెలిసిందే. తెరాసతో తెదేపా కలిసినా కలవకపోయినా భాజపాతో కలిసి సాగితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు కూడా అనుకొంటున్నారు. 

కనుక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బదులు భాజపా వైపు మొగ్గు చూపి ఉండి ఉంటే చాలా సాఫీగా మారిపోయే అవకాశం ఉండేది. కానీ అయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడంతో భాజపా నిరాశ చెందడం సహజమే.