అవి దొంగ..గజదొంగ పార్టీలుట!

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలను ఒకటి దొంగ, మరొకటి గజదొంగ అని గుజరాత్ లోని పటేల్ కులస్థుల యువనేత హార్దిక్ పటేల్ చెప్పడం విశేషం. తమ కులస్తులకు భాజపా సర్కార్ అన్యాయం చేసిందని బలంగా నమ్ముతున్న ఆయన, త్వరలో జరుగబోయే గుజరాత్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్దమయ్యాడు. దీనిపై మీడియా విలేఖరులు వివరణ కోరగా “ఒక గజదొంగను ఓడించడానికి మామూలు దొంగతో చేతులు కలిపితే తప్పేమిటి? భాజపా గజదొంగ అయితే, కాంగ్రెస్ పార్టీ దొంగ. కనుక గజదొంగను అడ్డు తొలగించుకొనేందుకు దొంగతో చేతులు కలుపక తప్పడం లేదు. నేను రాహుల్ గాంధీని కలవడానికే అహ్మదాబాద్ లో ఆయన బస చేసిన హోటల్ కు వెళ్ళాను కానీ ఆ సమయంలో ఆయన అక్కడలేకపోవడంతో నేను కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ను కలిసి వచ్చేశాను. నేను మొన్న రాత్రి ఆ హోటల్ కు వెళ్ళివచ్చిన వీడియో ఫుటేజిని భాజపా నేతలు సేకరించి దానిని మీడియాకు లీక్ చేశారు. నేను రాహుల్ గాంధీని కలవడానికి వెళ్ళానని నిరూపించవలసిన అవసరం భాజపాకి దేనికి? నన్ను అడిగితే నేనే చెప్పేవాడిని కదా? అవును నేను రాహుల్ గాంధీని కలవడానికే ఆ హోటల్ కు వెళ్ళాను. ఏమి నేను రాహుల్ గాంధీని కలవకూడదా? నాకు నచ్చిన పార్టీతో చేతులు కలపకూడదా? గుజరాత్ లో ఉన్న మనుషులు, ఆస్తులు అన్నిటిపై భాజపాకు యాజమాన్య హక్కులు ఉన్నట్లు ఎందుకు ప్రవర్తిస్తోంది? మేమేమి భాజపా స్వంత ఆస్తులం కాదు కదా?” అని ఘాటుగా ప్రశ్నించారు. 

హార్దిక్ పటేల్ ఏ పార్టీతో చేతులు కలిపినా ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు కానీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతూ దానిని ‘దొంగ పార్టీ’ అనడమే ఆ పార్టీ నేతలు జీర్ణించుకోవడం కష్టం. ఇదేమాట ఆయన రాహుల్ గాంధీ ముందు కూడా అనగలరా? తమ పార్టీ గురించి హార్దిక్ పటేల్ అన్న ఈ మాటలు రాహుల్ గాంధీ చెవిన పడే ఉంటాయి. తమ పార్టీపై అతనికి ఇంత చులకనభావం ఉందని తెలిసిన తరువాత కూడా అతనితో చేతులు కలపడానికి సిద్దపడితే విశేషమే.