హైవేరోడ్డుపై యుద్ధ విమానాలు లాండింగ్

అత్యవసర పరిస్థితులలో జాతీయ రహదారులపై యుద్ధవిమానాలు లాండింగ్ మరియు టేకాఫ్ అయ్యేందుకు భారత వాయుసేన ఈరోజు ప్రయోగాత్మకంగా పరీక్షలు జరుపుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో-ఆగ్రా జాతీయ రహదారిపై ఉన్నాం జిల్లాలో బంగార్ మౌ అనే ప్రాంతంలో మంగళవారం ఉదయం భారత వాయుసేనకు చెందిన ఒక యుద్ధ విమానం, ఒక బారీ సరుకు రవాణా విమానం ల్యాండింగ్ అయ్యి మళ్ళీ టేకాఫ్ తీసుకొన్నాయి. ఈరోజే మరో 15 యుద్ద విమానాలతో భారత వాయుసేన ఈ ప్రయోగం నిర్వహించనుంది. 

ఈ ప్రయోగంలో వాయుసేనకు చెందిన సుఖోయ్-30, మిరేజ్-2000 యుద్దవిమానాలు, 35,000 కిలోల బరువు గల సి-130 బారీ కార్గో విమానం పాల్గొంటున్నాయి. ఈ ప్రయోగాల కోసం లక్నో-ఆగ్రా మద్య యుమునా ఎక్స్ ప్రెస్ హైవేను పాక్షికంగా మూసివేశారు.  అంత బారీ సరుకు రవాణా విమానాలను, యుద్దవిమానాలను దగ్గర నుంచి చూసేందుకు ప్రజలకు అనుమతించడంతో దారి పొడవునా వేలాదిమంది ప్రజలు బారులు తీరి నిలబడి వాటిని చూసి ఆనందించారు. 

అత్యవసర పరిస్థితుల్లో యుద్ద విమానాలు దిగి టేకాఫ్ చేసుకోవడానికి దేశ వ్యాప్తంగా కీలకప్రాంతాలలో 12 హైవే రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. గత రెండు మూడేళ్ళుగా భారత వాయుసేన ప్రతీ ఏటా ఇటువంటి ప్రయోగాలు నిర్వహిస్తూ తన యుద్ద సంనధతను పరీక్షించుకొంటోంది.