రేవంత్ రెడ్డి గురించి విన్న మాట నిజమే?

రాజకీయ నాయకుల మద్య విభేదాలు బయటపడనంతవరకు వారి తెర వెనుక భాగోతాల గురించి మూడోకంటికి కూడా తెలియవు. కానీ ఒకసారి విభేదాలు మొదలైతే వారంతట వారే ఎదుట వ్యక్తి గురించి ఎవరూ ఊహించలేని నిజాలు చెపుతుంటే అవి విని ప్రజలు ఆశ్చర్యపోకమానరు. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుదామని నిర్ణయించుకొన్న తరువాత, ఏపి ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, ఇంకా ఇతర తెదేపా నేతలకు తెలంగాణా ప్రభుత్వంతో ఉన్న ప్రాజెక్టు కాంట్రాక్టుల గురించి, హైదరాబాద్ లో వారి వ్యాపారలావాదేవీల గురించి బయటపెట్టారు. అందుకు బదులుగా తెదేపా నేత పయ్యావుల కేశవ్ ఈరోజు రేవంత్ రెడ్డి గురించి సంచలన ఆరోపణలు చేశారు.

పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ, “నాపై రేవంత్ రెడ్డి విమర్శలు చేసినప్పుడు, మొదట ఏవిధంగా స్పందించాలో నాకు అర్ధం కాలేదు. ఎందుకంటే ఇద్దరం వేర్వేరు రాష్ట్రాలకు చెందినప్పటికీ ఓకే పార్టీలో ఉన్నాము. కనుక మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీయాత్ర ముగించుకొని విజయవాడ తిరిగివచ్చేక ఆయనను సంప్రదించిన తరువాతే దీని గురించి మాట్లాడుదామనుకొన్నాను. కానీ నా సహచరుడే నాపై అంత తీవ్ర విమర్శలు చేసిన తరువాత కూడా నేను నిశబ్దంగా ఉన్నట్లయితే, వాటిని నేను అంగీకరించినట్లవుతుంది. దాంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఇపుడు స్పందించవలసి వస్తోంది.

“రేవంత్ రెడ్డి డిల్లీ పర్యటనల రికార్డులన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అయన తెరాస ఎంపి కవితతో కలిసి ఒక కంపెనీ స్థాపించుకొనేందుకు రిజిస్టర్ చేయించుకొన్న మాట వాస్తవమా కాదా? ఆయన జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగిన మాట వాస్తవమా కాదా?” అని కేశవ్ ప్రశ్నించారు.

అయితే పయ్యావుల కేశవ్ ఆరోపించినట్లుగా రేవంత్ రెడ్డి, కవితతో కలిసి వ్యాపారమో లేదా పరిశ్రమో స్థాపించేంతటి సన్నిహిత రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నట్లయితే, ఆయన తెరాసలో చేరాలి కానీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎందుకు అనుకొంటారు?

ఇక తెదేపా నేతలతో సహా ఏపిలో అనేకమంది కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు తెలంగాణాలోనే కాదు...దేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ తో సహా అనేక రాష్ట్రాలలో కాంట్రాక్టులు చేస్తున్నారని మంత్రి కేటిఆర్ కొంతకాలం క్రితం స్వయంగా చెప్పారు. ప్రస్తుతం ఆ రంగంలో వారితో ఎవరూ పోటీ పడలేని పరిస్థితిలో ఉన్నారు కనుక వారు తెలంగాణా రాష్ట్రంలో కూడా ప్రాజెక్టులు కాంట్రాక్టు పనులు దక్కించుకొంటే ఆశ్చర్యమేమీ లేదని మంత్రి అన్నారు.

కనుక రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు బహుశః ఏపి మంత్రి యనమల లేదా ఆయన సమీప బంధువులు కానీ తెలంగాణాలో కాంట్రాక్టులు దక్కించుకొని ఉండి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. కానీ తెదేపా నేతల మద్య జరుగుతున్న ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విభేదాలు, పార్టీ మార్పిడి వార్తల కారణంగా తెలంగాణాలో ఇప్పటికే శిలావస్థలో ఉన్న తెదేపాను ఎవరూ ఏమీ చేయకుండానే దానంతట అదే కుప్పకూలిపోయేలా కనిపిస్తోంది.