నేడు మంత్రివర్గ సమావేశం

ఈనెల 27వ తేదీ నుంచి తెలంగాణా రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు మొదలుకానున్నందున, వాటిలో ప్రవేశపెట్టవలసిన బిల్లులు, ఇతర అంశాల గురించి చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగబోతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ననే వరంగల్ లలో పంచాయితీ రాజ్ చట్ట సవరణలు చేసి, కొత్తగా 4-5,000 పంచాయితీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈరోజు సమావేశంలో దాని ముసాయిదా బిల్లుపై కూడా చర్చించబోతున్నారు.

గత సమావేశాల నుంచి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం భూసర్వే వంటి వివిధ అవసరాల కోసం 8 ఆర్డినెన్సులు జారీ చేసింది. తెలంగాణా రైతు సమన్వయ సమితిలకు చట్టబద్దత కల్పించాలని భావిస్తోంది. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటించిన కొత్త పంచాయితీల కోసం బిల్లును చట్టసభలలో ప్రవేశపెట్టవలసి ఉంది. ఇవి కాక వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినవి, పాలనాపరమైన అంశాలు దాదాపు 80 వరకు ఉన్నాయి. వీటన్నిటిపై ఈరోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించి అజెండా రూపొందించబోతున్నారు. ఈనెల 26న శాసనసభ బిఎసి సమావేశంలో అజెండా, షెడ్యూల్ పై మళ్ళీ చర్చించి ఆమోదం తెలుపుతారు.