హైదరాబాద్ తలదన్నేలా వరంగల్ అభివృద్ధి చేస్తాం: కేసీఆర్

వరంగల్ రూరల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ (కెఎంటిపి), వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు, ఖాజీపేట రైల్, రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్.ఓ.బి) పనులకు, మడికొండ ఐటీ పార్కులోని ఐటి ఇన్క్యుబేషన్ సెంటర్ రెండవ దశ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం శంఖుస్థాపనలు చేశారు. తరువాత కెఎంటిపి పైలాన్ అవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, “హైదరాబాద్ తలదన్నేలా వరంగల్ అభివృద్ధి చేస్తాం. దేశంలోకే అతిపెద్దది కాబోతున్న కెఎంటిపికు భవిష్యత్ లో దేశవిదేశాల నుంచి చాలా మంది వచ్చిపోతుంటారు కనుక మామునూరు విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పునరుద్దరిస్తాం. అలాగే దగ్గరలోనే ఖాజీపేట రైల్వే జంక్షన్ ఉంది. కొత్తగా అవుటర్ రింగ్ రోడ్డు కూడా నిర్మించబోతున్నాము కనుక ఒకటి రెండేళ్ళ వ్యవధిలో వరంగల్ రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. ఇక వచ్చే జూలై నాటికల్లా  కాళేశ్వరం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలలోని 10 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించబోతున్నాము. అప్పుడు రైతులు రెండు పంటలే పండిస్తారో మూడు పంటలు పండిస్తారో చూద్దాం. హైదరాబాద్ లో ఇప్పటికే చాలా ఉన్నత విద్యాసంస్థలున్నాయి కనుక ఇక నుంచి రాష్ట్రానికి కొత్తగా ఏ ఉన్నత విద్యాసంస్థ వస్తున్నా దానిని వరంగల్ లోనే ఏర్పాటు చేస్తాం. ఈవిధంగా విద్య, వైద్య, పారిశ్రామిక, సాగునీటి రంగాలలో తెలంగాణా రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే ముందుగా వరంగల్ జిల్లాలు అభివృద్ధి చెందబోతున్నాయి కనుక ‘బంగారి తెలంగాణా’లో భాగంగా మొట్టమొదట ఈ రెండు జిల్లాలు ‘బంగారు వరంగల్ జిల్లాలుగా’ మారబోతున్నాయని ఖచ్చితంగా చెప్పగలను,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 

ఈ కెఎంటిపి ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభిస్తే తెలంగాణా నుంచి పొట్ట చేత్తో పట్టుకొని మహారాష్ట్రాలోని భివాండి, గుజరాత్ లోని సూరత్, తమిళనాడులోని తిరుప్పూర్ తదితర ప్రాంతాలకు వెళ్ళిపోయిన నేత కార్మికులు అందరూ వెనక్కు తిరిగివచ్చి మన రాష్ట్రంలోనే ఆత్మగౌరవంతో పనిచేసుకొని బ్రతుకవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.