మాజీ మంత్రి శ్రీధర్ బాబు ప్లాన్ బెడిసికొట్టిందా?

మాజీ మంత్రి , సీనియర్ కాంగ్రెస్ నేత దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఒడేడు మాజీ సర్పంచ్ సుదర్శన్, భార్గవ్ అనే వ్యక్తిపై చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో సుదర్శన్, భార్గవ్ లను ఆదివారం అదుపులోకి తీసుకొన్నారు. 

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలానికి చెందిన ఒక భూమి కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు స్థానిక తెరాస మండలాద్యక్షుడు కిషన్ రెడ్డి అడ్డుపడటంతో, ఆయన ఒడేడు మాజీ సర్పంచ్ సుదర్శన్ తో కలిసి కిషన్ రెడ్డిని మాదక ద్రవ్యాల కేసులో ఇరికించడానికి కుట్రపన్నినట్లు పోలీసులకు సాక్ష్యాధారాలు లభించాయి. వారిరువురూ కలిసి భార్గవ్ అనే వ్యక్తి ద్వారా తెరాస నేత కిషన్ రెడ్డికి తెలియకుండా అయన నివాసం ముందున్న పశువుల కొట్టంలో గంజాయి బస్తాలు పెట్టించి పోలీసులకు పట్టించి ఇద్దామని కుట్రపన్నారు. గత ఏడాది వినాయకచవితి పండుగ రోజున ఈ కుట్రను అమలుచేశారు కూడా. కానీ గంజాయి బస్తాలు పెట్టిన తరువాత భార్గవ్ ఎందుకో భయపడి మళ్ళీ వాటిని అక్కడి నుంచి తీసేశాడు. దానితో సుదర్శన్, భార్గవ్ మద్య గొడవలు మొదలయ్యాయి. ఈ విషయం  ఆ నోటా ఈ నోటా పడి చివరికి కిషన్ రెడ్డితో సహా ఊరందరికీ తెలిసిపోయింది. కిషన్ రెడ్డి పిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు సెక్షన్స్: 29 రెడ్ విత్ 20(బి) (2) బి ఆఫ్ ఎన్.డి.పి.ఎస్. చట్టం కింద శ్రీధర్ బాబుతో సహా ముగ్గురిపైన కేసు నమోదుచేశారు.

దీనిపై శ్రీధర్ బాబు స్పందిస్తూ, "ముఖ్యమంత్రి కేసీఆర్ ఈవిధంగా చట్టాన్ని ఆడ్డుపెట్టుకొని  తన రాజకీయ ప్రత్యర్దులను అడ్డు తొలగించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అయితే ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు నేను బెదిరిపోను. నేను ఎటువంటి తప్పు చేయలేదు," అని అన్నారు.