సిఎం కేసీఆర్ కీలక ప్రకటన

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వరంగల్ రూరల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన తరువాత జరిగిన బహిరంగ సభలో పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి చాలా కీలకమైన ప్రకటన చేశారు.

“ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 8,684 పంచాయితీలున్నాయి. త్వరలో అదనంగా మరో 4 నుంచి 5,000 కొత్త పంచాయితీలను ఏర్పాటు చేస్తాం. ప్రతీ 600 మంది జనాభాకు ఒకటి చొప్పున కొత్త పంచాయితీలను ఏర్పాటుచేస్తాము.  తద్వారా రాష్ట్రంలోని గిరిజన గూడేలు, లంబాడా తండాలు, గోండు గూడేల వంటివన్నీ గ్రామపంచాయతీలుగా మార్పు చెందుతాయి. కొత్త పంచాయితీల ఏర్పాటు కోసం సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలోనే ముసాయిదా బిల్లుపై చర్చించి నిర్ణయం తీసుకొంటాము. గ్రామ స్వరాజ్యానికి సరైన అర్ధం చెప్పే రీతిలో పంచాయితీరాజ్ చట్టానికి సమూల మార్పులు చేస్తాము. గ్రామపంచాయితీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తాము. రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి అవసరమైన నిధులు అందించేందుకు  2018-19 రాష్ట్ర బడ్జెట్ లో రూ.2,000 కోట్లు కేటాయిస్తాము,” అని ప్రకటించారు. 

తెలంగాణా ఏర్పడితే రాష్ట్రంలో 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని చేసి చూపించారు. కనుక ఇప్పుడు కొత్తగా 5-6,000 పంచాయితీలను ఏర్పాటు చేయడం కూడా ఖాయమనే భావించవచ్చు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయివరకు సమానంగా అభివృద్ధి జరుగాలంటే ఇటువంటి సాహసోపేతమైన పెను సంస్కరణలు చాలా అవసరం. ఈ సంస్కరణల వలన తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైనప్పటికీ దీర్ఘాకాలంలో మంచి ఫలితాలు కనబడటం తధ్యం. ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు, అవరోధాలు ఎదురైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యంగా సంస్కరణలు చేస్తుండటం చాలా అభినందనీయం.