టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన అనుచరులను సంప్రదించకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో, వారిలో కొంతమంది శుక్రవారం తెరాసలో చేరిపోయారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“మీ కొడంగల్ నాయకుడు రాష్ట్ర రాజకీయాలలో శిఖండి పాత్ర పోషిస్తున్నారు. తల్ ఉద్యమసమయంలో ఆయన అదేవిధంగా ప్రవర్తించాడు. తెలంగాణా ఏర్పడి రాష్ట్రాభివృద్ధి జరుగుతుంటే ఇప్పుడు అలాగే వ్యవహరిస్తున్నాడు. ఆయనకు తెల్లారి లేస్తే ఒకటే పని. అది ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టిపోయడమే. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఆయన మాటలను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కు కూడా ఇతర నియోజకవర్గాలతో సమానంగా నిధులు అందజేస్తూనే ఉన్నారు. తమ మద్య ఉన్న ఈ రాజకీయ విభేదాల కారణంగా కరువుతో అల్లాడుతున్న కొడంగల్ ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ విరివిగా నిధులు మంజూరు చేస్తూ కొడంగల్ లో అనేక అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాలకు అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఎవరు ప్రాతినిద్యం వహిస్తున్నా ప్రజలందరినీ తండ్రిలాగ సమానదృష్టితో చూస్తూ వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నారు. అయినా కాంగ్రెస్, తెదేపా నేతలు అడుగడుగునా అడ్డు పడుతూనే ఉన్నారు. మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వారికి సమయం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.
రేవంత్ రెడ్డి తెదేపా నేతలను కూడా కలుపుకుపోకుండా, తనకు నచ్చినట్లుగా ఒంటరిగా ముందుకు సాగుతుండటం వలన పార్టీలో సీనియర్ నేతలు కూడా ఆయనపై చాలా కోపంగా ఉన్నారనే విషయం నిన్న పోలిట్ బ్యూరో సమావేశంలో బయటపడింది. బహుశః అందుకే ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని శిఖండితో పోల్చినట్లున్నారు.