టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు రావడం, ఆయన ఏపిలో స్వంత పార్టీకే చెందిన నేతలు, మంత్రులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం వంటి పరిణామాలపై చర్చించేందుకు టిటిడిపి పోలిట్ బ్యూరో మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు హైదరాబాద్ లోని తమ పార్టీ ప్రధానకార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శుక్రవారం సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి వారు రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కానీ అయన పార్టీ వీడే ఆలోచనలో ఉన్నందున పాల్గొనకపోవచ్చు.
టిటిడిపి కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి కోరుతుంటే, మోత్కుపల్లి నరసింహులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తెరాసతో పొత్తులు పెట్టుకొంటే మంచిదని సూచిస్తున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అనంతపురం పర్యటన తరువాత తెదేపా, తెరాసలు పొత్తులకు సిద్దం అవుతున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కనుక తెలంగాణాలో తెదేపా మళ్ళీ మరోసారి క్రాస్ రోడ్స్ లో నిలబడి ఉన్నట్లు చెప్పవచ్చు. అది కాంగ్రెస్, తెరాసలలో ఎటువైపు వెళుతుందో చూడాలి.
ఒకప్పుడు ఓటుకు నోటు కేసుతో టిటిడిపికి ఎటువంటి కుదుపు, నష్టం వాటిల్లిందో ఇప్పుడు పార్టీలో తలెత్తిన ఈ తాజా సంక్షోభంతో మళ్ళీ అటువంటి పరిస్థితులే ఎదుర్కోవలసి వస్తోంది. అయితే ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉన్న కారణంగా ఈరోజు జరుగబోయే ఈ కీలక సమావేశంలో టిటిడిపి నేతలు ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోయినా, రేవంత్ రెడ్డి విషయంలో పార్టీ వైఖరిపై కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.