ఈనెల 11న ఇంటి నుంచి అదృశ్యమైన కరీంనగర్ జిల్లా గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన సాయి ప్రజ్వల (17) ఆచూకీని పోలీసులు గురువారం కనుగొన్నారు. ఆమె అప్పటి నుంచి ఫిర్జాదీగూడలో గల ఒక హాస్టల్ లో ఉంటోంది. హైదరాబాద్, నారాయణ కాలేజీలో మెడికల్ ఎంట్రన్స్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొంటున్న ఆమె ఆ కాలేజీ యాజమాన్యం ఒత్తిడి భరించలేకపోతున్నానని లేఖ వ్రాసి వెళ్ళిపోయింది. ఆమె తల్లితండ్రుల పిర్యాదు అందుకొన్న మేడిపల్లి పోలీసులు అప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతూ చివరికి ఆమె ఫిర్జాదీగూడ హాస్టల్ లో ఉన్నట్లు కనుగొనగలిగారు. ఆమెను నిన్న ఆమె తల్లి తండ్రులకు అప్పగించారు.
17 ఏళ్ళు వయసున్న ఆ బాలిక వ్రాసిన లేఖతో రెండు తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కాలేజీలలో చదువుకొంటున్న విద్యార్ధుల ఎంత దయనీయ పరిస్థితులలో ఉన్నారో బయటపడటంతో విద్యావేత్తలు, విద్యార్ధుల తల్లి తండ్రులు, విద్యార్దీ సంఘాలు, మీడియా తీవ్ర నిరసనలు తెలియజేశారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మేల్కొని తక్షణమే కార్పోరేట్ కాలేజీల యాజమాన్యాలతో చర్చించడం మొదలుపెట్టాయి. అయితే ఆ కాలేజీలు ఏపిలో మున్సిపల్ శాఖ మంత్రిగా చేస్తున్న నారాయణకే చెందినవి కావడం, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా ఉండటం చేత ఏపి సర్కార్ ఆ కాలేజీల తీరు మార్చుకొనేలా చేయడం దాదాపు అసంభవమేనని చెప్పవచ్చు. కానీ తెరాస సర్కార్ తలుచుకొంటే తెలంగాణాలో వారి కాలేజీలను గాడిన పెట్టడం అసంభవమేమీ కాదు. లేకుంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకమానవు.