తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగుతున్నానని చెపితే ఎవరూ నమ్మరు కానీ నమ్మాలంటున్నారు నారా లోకేష్. రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నాడంటూ వస్తున్న వార్తలన్నీ మీడియా సృష్టేనని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు రేవంత్ రెడ్డి ఎక్కడ చెప్పారు? అని ప్రశ్నించారు. డిల్లీ హైకోర్టులో కేసు వేయడానికి ఆయన డిల్లీ వెళ్ళారని దానిని వక్రీకరించి పార్టీ మారుతున్నట్లు మీడియా చెపుతోందని నారా లోకేష్ అన్నారు. ఆయన పార్టీ మారుతున్నట్లు మీడియా బ్రేకింగ్ న్యూస్ వేయడాన్ని నారా లోకేష్ తప్పు పట్టారు. మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వేసినంత మాత్రాన్న ఆయన పార్టీ మారిపోరని అన్నారు.
రేవంత్ రెడ్డి పార్టీ మారుతానని చెప్పలేదు కానీ ఆయన స్వంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడానికి అర్ధం అదేనని రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న వారెవరైనా చెప్పగలరు. కానీ నారా లోకేష్ కు అది అర్ధం కానట్లు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి బహుశః చంద్రబాబు నాయుడుపై కూడా విమర్శలు చేస్తేగానీ అర్ధం కాదేమో? అయినా నిప్పంటుకొన్న గుడ్డముక్కను జేబులో దాచుకొంటే ఎవరికి నష్టం? ఇంకా ఎంతకాలం దాచుకోగలరు?