గట్టిగా వాన పడితే చాలు..హైదరాబాద్ రోడ్లు చెరువులుగా మారిపోతుంటాయి. కాలనీలలోకి..ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తుంటాయి. రోడ్లపై పెద్దపెద్ద గోతులు ఏర్పడుతుంటాయి. ఈ దుస్థితిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రకృతి పెడుతున్న ఈ పరీక్షలలో ఓడిపోతూనే ఉంది. ఆ కారణంగా హైదరాబాద్ నగర ప్రజల ఆగ్రహాన్ని, ప్రతిపక్షాల విమర్శలను భరించక తప్పడం లేదు.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్ జలమండలి కార్యాలయంలో జి.హెచ్.ఎం.సి. అధికారులతో ఈ సమస్యపై చాలా సేపు చర్చించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నగరంలో డివిజన్లవారీగా రోడ్ల నిర్వహణ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు. ఇకపై ప్రతీ డివిజన్ కు ఒక ఇంజనీరు చొప్పున మొత్తం 150 మందిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవంబర్ 1వ తేదీ నుంచి వారందరూ తమ పనులు ప్రారంభిస్తారని మంత్రి కేటిఆర్ అన్నారు.
వర్షాల వలన నగరంలో 350 ప్రాంతాలలో రోడ్లు తరచూ ముంపుకు గురయ్యి పాడవుతున్నట్లు అధికారులు గుర్తించారు. రూ.130 కోట్లు వ్యయంతో వాటిపై ప్లాస్టిక్ మెటీరియల్ తో కూడిన వైట్ టాపింగ్ చేయాలని నిశ్చయించారు. వచ్చే ఏడాదిలోగా ఈ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్ నగరంలో డ్రైనేజి, రోడ్ల మరమత్తులు, కొత్త రోడ్లు, కాలువల నిర్మాణం అన్నీ నిరంతరంగా సమాంతరంగా సాగే విధంగా ప్రణాళికలను సిద్దం చేయాలని మంత్రి కేటిఆర్ అధికారులను ఆదేశించారు. ఒక ఏడాదిలోగా నగరంలో ఈ పరిస్థితులలో మార్పు కనబడే విధంగా అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి కేటిఆర్ అధికారులను కోరారు.