కమల్ కుప్పిగంతులు

ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో సరికొత్త రాజకీయ పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలో వస్తానని ప్రకటించినప్పటి నుంచి రోజుకో మాట మాట్లాడుతూ తన అపరిపక్వతను పదేపదే చాటుకొంటున్నారు. గత ఏడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ రూ.500,1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే, కమల్ హాసన్ ఆ నిర్ణయాన్ని స్వాగతించుతూ నోట్ల రద్దు వలన దేశానికి చాలా మేలు కలుగుతుందని అన్నారు. కానీ ఇప్పుడు మాట మార్చి “ఆనాడు తొందరపాటుతో నోట్ల రద్దును సమర్ధిస్తూ మాట్లాడాను. కానీ ఆనాడు మోడీ తీసుకొన్న నిర్ణయం వలన ఆశించిన ప్రయోజనం కలుగలేదని, పైగా దాని వలన దేశంలో సామాన్య ప్రజలు నానా కష్టాలు పడ్డారని గ్రహించాను. కనుక తొందరపడి ఆ నిర్ణయాన్ని సమర్ధించినందుకు పశ్చాత్తాపపడుతున్నాను. అందుకు ప్రజలను క్షమాపణ వేడుకొంటున్నాను,” అని కమల్ హాసన్ అన్నారు.  

కమల్ హాసన్ ఆరోజు చాలా నిజాయితీగానే ఆ నిర్ణయాన్ని సమర్ధించారు. కానీ ఇప్పుడే తన రాజకీయ ప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకొని క్షమాపణలు చెప్పుకొంటున్నారు. అంటే ఆనాడు ఆయనలో ఉన్న నిజాయితీ ఇప్పుడు లేదని అర్ధం అవుతోంది. ఆ అంశంపై ఎవరైనా అభిప్రాయం మార్చుకోవడం తప్పేమీ కాదు కానీ రాజకీయ కారణాలతో హడావుడిగా పశ్చాతాపం వెలిబుచ్చడం, ప్రజలను క్షమాపణ కోరడమే చాలా నాటకీయంగా ఉంది. దీనితో తాను భాజపాను వ్యతిరేకిస్తున్నానని..తాను సెక్యులర్, సోషలిస్ట్ నని ప్రజలకు చాటి చెప్పుకొనే ప్రయత్నం చేశారు కానీ అదే సమయంలో అనవసరంగా భాజపాతో శత్రుత్వం పెంచుకొన్నట్లయింది. ఈ అంశం గురించి అయన మాట్లడకుంటేనే గౌరవంగా ఉండేది కానీ ఇటువంటి చవుకబారు స్టేట్ మెంట్ ఇచ్చి నవ్వులపాలయ్యారని చెప్పక తప్పదు.