అందుకే దత్తాత్రేయను తప్పించారు: రేవంత్

వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కూడా తెదేపాయే అధికారంలోకి వస్తుందని ఇంతకాలం వల్లెవేస్తూ వచ్చిన టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిల్లీ వెళ్లి తిరిగివచ్చిన తరువాత తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీల వాస్తవ పరిస్థితిని స్వయంగా చాటిచెప్పడం విశేషం. 

ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణాలో అధికార, ప్రతిపక్షాలని చెప్పడం కంటే ఒకటి కేసీఆర్..రెండు అయనను వ్యతిరేకించేవారని చెప్పడమే సరైనదని నేను భావిస్తున్నాను. కనుక కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే ఆయన వ్యతిరేకిస్తున్నవారందరూ కలిసి పనిచేయక తప్పదు. తెలంగాణాలో భాజపా తన ఉనికిని కోల్పోతోంది గనుకనే బండారు దత్తాత్రేయను కేంద్రమంత్రి పదవిలో నుంచి తప్పించబడ్డారని నేను భావిస్తున్నాను,” అని అన్నారు. 

తెలంగాణాలో భాజపాతో సహా ప్రతిపక్షపార్టీలన్నీ పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, అవన్నీ కలిసి పనిచేస్తే తప్ప కేసీఆర్ ను ఎదుర్కోలేవని రేవంత్ రెడ్డి అంగీకరించడం విశేషమే.