త్వరలో తెలంగాణా శాసనసభా సమావేశాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈనెల 27వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించారు. కనీసం రెండు నుంచి మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించి, ప్రజా సమస్యలన్నిటిపై లోతుగా చర్చిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సభలో ప్రతిపక్ష సభ్యులు ఎ అంశంపై ప్రశ్నించినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పేవిధంగా తమతమ శాఖలు, నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని సిద్దమైరావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ నెల 26 బిఎసి సమావేశం ఏర్పాటు చేసి శాసనసభ, మండలి షెడ్యూల్, అజెండాలు ఖరారు చేద్దామని ముఖ్యమంత్రి అన్నారు. 

ఈసారి కూడా తెరాస సర్కార్ తో శాసనసభ, మండలిలో పోరాడేందుకు ప్రతిపక్షాల వద్ద అనేక బలమైన అంశాలున్నాయి. మియాపూర్ భూకుంభకోణం, సినీ ప్రముఖుల డ్రగ్స్ విచారణ కేసులు, తెలంగాణా రైతు సమన్వయ సమితిల ఏర్పాటు, భూసర్వే, బతుకమ్మ చీరల కొనుగోలు, పంపిణీలో అవకతవకలు, కొత్త సచివాలయ నిర్మాణం వంటి అనేక అంశాలున్నాయి.

అలాగే సింగరేణి ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించి ప్రతిపక్షాలను మళ్ళీ మరోసారి చావుదెబ్బ తీసినందుకు తెరాస కూడా చాలా విజయోత్సాహంతో ఉంది. కనుక ఈ సమావేశాలలో అది ప్రతిపక్షాలను చీల్చి చెండాడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. పైగా కాంగ్రెస్ నేతల మద్య గొడవలను కూడా అది వేలెత్తి చూపించుతూ ఎదురుదాడి చేసినా ఆశ్చర్యం లేదు.