చంద్రబాబు బుట్టలో రేణుక

వైకాపా కర్నూలు లోక్ సభ సభ్యురాలు బుట్టా రేణుక తన అనుచరులతో కలిసి ఈరోజు ఉదయం ఏపి సిఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. అయితే పార్టీ కండువా కప్పుకొన్నట్లయితే అనర్హత వేటు పడే అవకాశం ఉంది కనుక కప్పుకోలేదు. ఆమె గత కొంత కాలంగా వైకాపాకు దూరంగా తెదేపాతో సన్నిహితంగా మెలుగుతున్నారు. వచ్చే ఎన్నికలలో కూడా తన సీటును తనకే కేటాయిస్తానని హామీ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడంతో ఈరోజు జంప్ చేసేశారు. ఆమెతో బాటు సుమారు వందమంది కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఈరోజు తెదేపాలో చేరారు. 

వచ్చే ఎన్నికలలో ఎట్టిపరిస్థితులలో విజయం సాధించి, తన ముఖ్యమంత్రి కలను నెరవేర్చుకోవాలని తపనతో జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2వ తేదీ నుంచి ఏపిలో ఆరు నెలల పాటు 3,000 కిమీ పాదయాత్ర చేయడానికి సిద్దం అవుతున్నారు. ఈ మహా పాదయాత్రతో రాష్ట్రంలో ప్రజలందరినీ వైకాపావైపు ఆకర్షించాలని భావిస్తున్నారు. అయితే అయన పాదయాత్ర మొదలుపెడుతున్న సమయానికే చంద్రబాబు నాయుడు వైకాపా ఎంపిని, ఆమె అనుచరులను తెదేపాలోకి రప్పించడం ద్వారా జగన్ కు ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించినట్లయింది. ఒకపక్క ఈవిధంగా పార్టీ ఖాళీ అయిపోతుంటే దానిని కాపాడుకోకుండా జగన్ పాదయాత్రకు బయలుదేరితే చివరికి ఆయన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుందేమో?