సింగరేణి కార్మికులకు దీపావళి గిఫ్ట్

ఇటీవల దసరా పండుగ సందర్భంగా జీతంతో కలిపి డబుల్ బోనస్ అందుకొన్న సింగరేణి కార్మికులు, ఈరోజు ఒక్కొక్కరు రూ.51,000 చొప్పున అందుకోబోతున్నారు. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు, జాతీయ కార్మిక సంఘాలకు మద్య కుదిరిన వేతన ఒప్పందం ప్రకారం 2016 జులై 1 నుంచి వేతనాలు పెరిగాయి. కనుక దాని ప్రకారం గత 15 నెలల వేతన బకాయిలు సింగరేణి సంస్థ కూడా చెల్లించవలసి ఉంది. దానిలో మొదటి విడతగా ఈరోజు ఒక్కో కార్మికుడికి రూ.51,000 చొప్పున చెల్లించబోతున్నట్లు ఆ సంస్థ సిఎండి శ్రీధర్ నిన్న కార్మిక సంఘాలకు తెలియజేశారు. దీని కోసం ఈరోజు రూ.265 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు.

సరిగ్గా దీపావళి పండుగకు రెండు రోజుల ముందు ఇది అందుతోంది కనుక దీనిని దీపావళి కానుకగానే భావించవచ్చు. ఈనెల మొదట్లో జీతాలు, బోనసులు అన్నీ కలుపుకొని ఒక్కో కార్మికుడు సుమారు లక్ష రూపాయలు అందుకొన్నారు. దానికి ఇది అదనం కనుక ఈనెల సింగరేణి కార్మికులకు పండుగే పండుగ.