వరంగల్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో గల రోహిణి ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం సుమారు 5.15 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఇద్దరు రోగులు మృతి చెందారు. సుబేదారి ప్రాంతంలో 250 పడకల సామర్ధ్యం గల రోహిణి ఆసుపత్రిలో ఈ అగ్నిప్రమాదం జరిగిన సమయానికి 193 మంది రోగులు వివిధ విభాగాలలో చికిత్స పొందుతున్నారు. భూపలపల్లికి చెందిన జెట్టి కుమారస్వామి అనే వ్యక్తి కాలికి ఆపరేషన్ జరుగుతుండగా ఆర్ధో ఆపరేషన్ ధియేటర్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దానితో పక్కనే ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయి గదంతా మంటలు వ్యాపించాయి. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు, సహాయ సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న రోగిని పట్టించుకోకుండా భయంతో బయటకు పరుగులు తీశారు. దానితో అతను మంచం మీదే కాలి బూడిదయ్యాడు. పక్కనే న్యూరో ధియేటర్ లో మరో రోగికి ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ సంజయ్ మాత్రం ఆ రోగిని భుజం మీద మోసుకొంటూ బయటకు తీసుకురావడంతో అతను బ్రతికిపోయాడు.

ఆసుపత్రి రెండవ అంతస్తులో మొదలైన మంటలు చాలా వేగంగా మూడవ అంతస్తుకు కూడా వ్యాపించడంతో వైద్యులు, సిబ్బంది, రోగులు, వారి బంధువులు అందరూ భయాందోళనతో ఆసుపత్రి బయటకు పరుగులు తీశారు. అయితే ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తెలివిగా ప్రవర్తించి రోగులను వీల్ చెయిర్స్, కొందరిని వారి మంచాలతో సహా అత్యవసర మార్గాల ద్వారా బయటకు తరలించడంతో బారీ ప్రాణనష్టం తప్పిపోయింది.

తక్షణం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని 15 నిమిషాలలో మంటలను ఆర్పివేశారు. ఈ అగ్నిప్రమాదం గురించి తెలియగానే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు, డిసిపి వేణుగోపాల్, ఏసిపి మురళీధర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, జిల్లా ఫైర్ ఆఫీసర్ కేశవులు తదితరులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరగడానికి కారణాలు తెలుసుకోవడానికి ఫైర్ ఆఫీసర్ కేశవులు విచారణ చేస్తారని ప్రకటించారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకొంటామని కడియం శ్రీహరి చెప్పారు. 

ప్రమాదం జరిగిన వెంటనే అందరికంటే ముందుగా పోలీసులు స్పందించడం విశేషం. అత్యవసరంగా వైద్యం అందించవలసిన కొందరు రోగులను తమ రక్షక్ వాహనాలలో సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించడంతో ప్రాణ నష్టం నివారించగలిగారు. అలాగే ఈ ప్రమాదం సంగతి తెలియగానే ఎన్.సి.సి.విద్యార్ధులు కూడా వచ్చి ఆసుపత్రి బయట ఉన్న రోగులకు సేవలు అందించడం అభినందనీయం.