భూమ్మీద నూకలు...గాలిలో ప్రాణాలు

వారందరికీ ఇంకా ఈ భూమీద నూకలు మిగిలే ఉన్నాయి అందుకే కాసేపు గాలిలో ప్రాణాలు పోయినట్లు అనిపించినా అందరూ క్షేమంగా బ్రతికిబయటపడగలిగారు. వారే ఎయిర్ ఏషియా ప్రయాణికులు.

ఈరోజు ఆస్ట్రేలియాలో పెర్త్ విమానాశ్రయం నుంచి ఇండోనేషియా బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం టేకాఫ్ అయిన అర్దగంటలోనే యధాప్రకారం 32,000 అడుగుల ఎత్తుకు చేరుకొని ప్రయాణిస్తోంది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది హటాత్తుగా 10,000 అడుగుల ఎత్తుకు జారిపోయింది. దానితో హటాత్తుగా విమానం లోపల ఒత్తిడి తగ్గిపోవడంతో ఆక్సిజన్ మాస్క్ లు క్రిందకు వచ్చాయి. అదే సమయంలో విమానంలో ఎమర్జెన్సీ అలారంలు మ్రోగడం మొదలుపెట్టాయి. ఈ హటాత్పరిణామాలతో విమానంలో ఉన్న 151 మంది ప్రయాణికులు, క్యాబిన్ క్రూ కూడా చాలా ఆందోళన చెందారు. కానీ అదృష్టవశాత్తు విమానం ఆ ఎత్తులో స్థిరంగా ప్రయాణించడం మొదలుపెట్టడంతో విమాన పైలెట్ మళ్ళీ దానిని పెర్త్ విమానాశ్రయానికి తరలించి, క్షేమంగా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు..విమాన సిబ్బంది.. అధికారులు అందరూ తేలికగా ఊపిరి తీసుకొన్నారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇది జరిగిందని, అందుకు ప్రయాణికులకు క్షమాపణ చెప్పారు విమాన పైలెట్. ఒక అర్ధగంటలోనే విమానంలో ప్రయాణికులు అందరూ మృత్యువు గుమ్మం వరకు వెళ్ళి వచ్చారు. తమ జీవితంలో ఇంతటి భయానకమైన క్షణాలను ఎన్నడూ చూడలేదని అన్నారు. నిజమే కదా! విమానం అదుపుతప్పి మరో 10,000 అడుగులు క్రిందకు దిగి ఉంటే ఏమయ్యేదో అందరికీ తెలుసు. థాంక్ గాడ్!