తెరాస సర్కార్ కు గత రెండేళ్ళుగా తరచూ ఇటువంటి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఒకపక్క రాష్ట్రంలో ప్రతిపక్షాలు, టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజా సంఘాలు, మీడియాలో ఒకవర్గం తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తుంటే, మరోపక్క ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు తెరాస సర్కార్ పనితీరును, అది రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రశంశలతో ముంచెత్తుతున్నాయి. అనేక అవార్డులు ప్రకటిస్తున్నాయి. అంటే తెరాస సర్కార్ సరైన మార్గంలోనే శరవేగంగా పయనిస్తోందని స్పష్టం అవుతోంది. అయినా కూడా ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలు తగ్గలేదు వాటి తీరు మారలేదు. కనుక తెరాస సర్కార్ ఇక వాటిని పట్టించుకోకుండా తను ఎంచుకొన్న మార్గంలో ముందుకు సాగిపోతోంది. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, తెలంగాణాకు చెందిన ప్రతిపక్ష పార్టీలు, వాటి నేతలు గుర్తించలేకపోయిన లేదా గుర్తించడానికి ఇష్టపడని ఈ ప్రగతిని రాష్ట్రంతో ఎటువంటి సంబంధమూ లేని బయటివారు గుర్తిస్తున్నారని చెప్పడానికే.
అటువంటిదే ఈరోజు మరో ఉదాహరణ కనబడింది. ఈరోజు వరంగల్ లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్, తదితరులు నీట్ లో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్నప్పుడు, దానిలో పాల్గొన్న మాజీ క్రికెటర్ శ్రీకాంత్ కృష్ణమాచారి, తెరాస సర్కార్ పనితీరును, రాష్ట్రాభివృద్ధికి అది చేస్తున్న కృషిని చాలా మెచ్చుకొన్నారు. పక్కనే ఉన్న ఐటి మంత్రి కేటిఆర్ భుజంపై ఆప్యాయంగా చెయ్యివేసి “ఈయన వంటి యంగ్ అండ్ డైనామిక్ మంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన కెప్టెన్సీలో తెలంగాణా తప్పకుండా విజయం సాధిస్తుంది. నేను పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందినవాడినైనప్పటికీ, మన దేశంలో అన్ని రాష్ట్రాలలోకి తెలంగాణా అభివృద్ధిలో నెంబర్: 1 స్థానంలో ఉందని చెప్పడానికి నాకు ఎటువంటి మొహమాటం లేదు,” అని అన్నారు. ఇంతకంటే రాష్ట్రానికి, తెరాస సర్కార్ కు గొప్ప అవార్డు ఏముంటుంది?
దేశంలో యువత ఉన్నత విద్యలభ్యసిస్తున్నప్పటికీ వారు ఉద్యోగాలలో చేరే వరకు కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ లో తగినంత ప్రావిణ్యం సంపాదించుకోలేకపోతున్నారు. యువతకు కార్పోరేట్ వ్యవహారాలలో మరియు సాఫ్ట్ స్కిల్స్ డెవెలప్ చేసుకొనేందుకు తగిన శిక్షణ ఇచ్చేందుకు శ్రీకాంత్ కృష్ణమాచారి ‘కెరీర్ స్ట్రోక్స్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దాని కోసం ఈరోజు వరంగల్ లో మొదలుపెట్టిన తెలంగాణా అకాడమిక్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో ఒప్పందం కుదుర్చుకొన్నారు.