మంత్రులు, ప్రజాప్రతినిధుల రాక సందర్భంగా వారి అనుచరులు ఊరంతా వారికి స్వాగతం చెపుతూ ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాటు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నాము. తెలంగాణా రాష్ట్రంలో ఫ్లెక్సీ బ్యానర్స్ ఏర్పాటుపై ప్రభుత్వం నిషేధం విధించి చాలా కాలమే అయ్యింది కానీ తెరాస నేతలు ఎవరూ దానిని పట్టించుకొన్న దాఖలాలు లేవు. రాష్ట్ర ఐటి మరియు పురపాలక మంత్రి కేటిఆర్ స్వయంగా ఎన్నిసార్లు వారించినా అయన మాట కూడా వినకుండా తెరాస నేతలు ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు.
ఈరోజు ఆయన వరంగల్ పర్యటనకు వస్తున్నందున తెరాస నేతలు యధాప్రకారం మళ్ళీ ఊరంతా ఫ్లెక్సీ బ్యానర్స్ తో నింపేశారు. దీనిపై వరంగల్ కు చెందిన ఒక యువకుడు కేటిఆర్ కు ఈవిషయంపై ట్విట్టర్ ద్వారా పిర్యాదు చేసి, ఫ్లెక్సీల నిషేదం అధికార పార్టీ వారికి వర్తించదా? అని ప్రశ్నించారు. దానిపై వెంటనే స్పందించిన మంత్రి కేటిఆర్ ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవు అని జవాబు ఇవ్వడమే కాకుండా వెంటనే తన ఫ్లెక్సీ బ్యానర్లు అన్నీ తొలగించాలని వరంగల్ మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. దాంతో వరంగల్ మున్సిపల్ సిబ్బంది హడావుడిగా ఫ్లెక్సీ బ్యానర్లను తొలగించడం మొదలుపెట్టారు. వారు అవి తొలగిస్తుండగానే మంత్రి కేటిఆర్ ఈరోజు ఉదయం హెలికాప్టర్ లో వరంగల్ చేరుకొన్నారు.
ఈరోజు ఆయన వరంగల్ లో తెలంగాణా అకాడమిక్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సెంటరును ప్రారంభించారు. తరువాత ఎన్.ఐ.టి.లో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఆ తరువాత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యి వివిధ అంశాలపై చర్చించారు. వరంగల్ జిల్లాలో సంగెం మండలంలోని చింతపల్లి-గీసుకొండ మండలంలోని శ్యాం పేట గ్రామాల మద్య గల 1,190.67 ఎకరాలలో ఏర్పాటు చేయబడుతున్న మెగా టెక్స్ టైల్ పార్క్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 20న శంఖుస్థాపన చేయబోతున్నారు కనుక మంత్రి కేటిఆర్ ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్లి స్థలం పరిశీలిస్తారు.