సూర్యాపేట కలెక్టర్ కార్యాలయానికి తొలి విఘ్నం

ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితమే సూర్యాపేట సమీకృత కలెక్టర్ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. కానీ అప్పుడే దానికి తొలి విఘ్నం ఎదురైంది. దాని నిర్మాణం కోసం ఎంచుకొన్న స్థలం ప్రజలకు ఏమాత్రం అందుబాటులోని లేదని, దాని వలన ప్రజాధనం వృధాకావడం తప్ప మరేది జరుగదని, కనుక అక్కడ నిర్మాణం ఆపివేయాలని కోరుతూ శుక్రవారం ప్రతిపక్ష పార్టీలన్నీ సూర్యాపేట బంద్ నిర్వహించాయి. వాటితో బాటు న్యూడెమొక్రసీ, బహుజన కమ్యూనిస్ట్ పార్టీ, టిజెఎసి, విద్యార్ధి, ప్రజాసంఘాలు కూడా బంద్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. 

కలెక్టర్ కార్యాలయం నిర్మిస్తుంటే దానికీ అభ్యంతరాలు వ్యక్తమవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతిపక్షాలు వాదిస్తున్నట్లుగా ఆ ప్రాంతం నిజంగా ప్రజలకు అందుబాటులో ఉండని ప్రదేశమయితే, దానిని అందరికీ అనువైన చోటికి ఇప్పుడే మార్చుకోవడం మంచిది. తద్వారా భవిష్యత్ లో అది అందరికీ ఉపయోగపడుతుంది లేకుంటే నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంటుంది. దాని వలన ప్రజాధనం కూడా వృధా అవుతుంది.  కానీ ప్రతిపక్షాలు కేవలం రాజకీయం చేయడం కోసమే అక్కడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లయితే వాటి అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోనవసరం లేదు. ఏమైనప్పటికీ మున్ముందు ఎటువంటి సమస్యలు రాకూడదనుకొంటే ప్రతిపక్షాలను కూడా పరిగణనలోకి తీసుకొని ముందుకుసాగితే మంచిది.