రాష్ట్రంలో ఐఎఎస్ అధికారులలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ప్రత్యేకమైన వ్యక్తి. ఆమె ఎన్నడూ ‘నేను కలెక్టర్ ని’ అనే అహంకారం ప్రదర్శించకుండా ప్రజలతో అధికారులతో చక్కగా కలిసిపోయి తను కష్టపడి పనిచేస్తూ అందరిచేత కూడా అలాగే పనిచేయిస్తుంటారు. ఇక ఆమె చాలా తరచుగా వరంగల్ పురవీధులలో ప్రజల మద్య కనబడుతుంటారు. యువకలెక్టర్ కనుక జిల్లాలోని యువతీయువకులతో కూడా చాలా చక్కగా కలిసిపోతుంటారు.
ఆమెకు సాహస క్రీడలు అన్నా చాలా ఆసక్తి కనబరుస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ఆమె జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాక్-క్లైమ్బింగ్ (పర్వతారోహణ) కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పాండవులగుట్టపైకి ఎక్కారు. మళ్ళీ నిన్న జిల్లాలో ధర్మాసాగర్ మండలం దేవనూర్ గ్రామం సమీపంలో గల ఇనుపరాతి గుట్టలపై (అటవీ ప్రాంతం)లో అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెతో బాటు జిల్లాకు చెందిన అనేకమంది అధికారులు, యువతీ యువకులు, నిట్ విద్యార్ధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె స్ఫూర్తితో జిల్లాలో ప్రజలు, యువత పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. అందుకు ఆమెను అభినందించవలసిందే.