నల్లగొండ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కాలంగా పోరాడుతున్నారు. ఇటీవల నిరాహార దీక్షకు కూడా సిద్దమయ్యారు కానీ ఎందుకో ఆఖరు నిమిషంలో వాయిదా వేసుకొన్నారు. బహుశః మెడికల్ కాలేజీ రాబోతోందని కబురు వచ్చేసిందేమో?
ఈరోజు సూర్యాపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాతనల్లగొండ జిల్లాకు ఒకటి, సూర్యాపేటకు మరొకటి మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 2018-19 ఆర్ధిక బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సూర్యాపేటపై వరాలజల్లు కురిపించారు. జిల్లా అభివృద్ధికి రూ.75 కోట్లు మంజూరు చేస్తునట్లు ప్రకటించారు. దానిలో జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.15 లక్షలు, ప్రతీ తండాకు రూ.10 లక్షలు చొప్పున ఖర్చు చేయాలని సూచించారు. సూర్యాపేటలోని పుల్లారెడ్డి చెరువుతో సహా జిల్లాలో అన్ని చెరువులను మిషన్ కాకతీయ పధకంలో భాగంగా పూడిక తీసి అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాలను, వాటిలో గ్రామాలను, తండాలను సమానంగా అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పారు. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎందువల్ల వచ్చిందో వివరించి, దానిని అరికట్టడానికి ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకొంటోందో ముఖ్యమంత్రి ప్రజలకు వివరించారు. పాత నల్లగొండ అభివృద్ధికి ఎంత ఖర్చైనా వెనుకాడబోమని చెప్పారు.