హిమాచల్ ఎన్నికల షెడ్యూల్ జారీ

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు సాయంత్రం వెలువడింది. ఈరోజు సాయంత్రం డిల్లీలో కేంద్ర ఎన్నికల కమీషనర్ నసీం జైదీ మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ తెలియజేశారు. ఆ వివరాలు: 

ఎన్నికల నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 16, నామినేషన్ల దాఖలు చేయడానికి గడువు: అక్టోబర్ 23, నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 24, పోలింగ్ తేదీ: నవంబర్ 6, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు ప్రకటన: డిశంబర్ 18. ఈరోజు నుంచి హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ప్రకటించారు. ఆ రాష్ట్రంలో మొత్తం 68 శాసనసభ స్థానాలున్నాయి. 49.05 లక్షల మంది ఓటర్లున్నారు. ఈసారి మొత్తం 7521 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఈవిఎంలను వివిపిఎటి మెషిన్లతో అనుసంధానం చేసి ఓటర్లకు రసీదులు కూడా ఇస్తామని నసీం జైదీ తెలిపారు.

సాంకేతిక కారణాల వలన గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు ప్రకటించలేదు కానీ ఆ ఎన్నికల ఫలితాలు కూడా డిశంబర్ 18 వెలువడుతాయని, అందుకు అనుగుణంగానే రెండు మూడు రోజులలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని నసీం జైదీ తెలిపారు. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్.కె.నగర్ శాసనసభ నియోజకవర్గానికి కూడా డిశంబర్ 31లోగా ఉపఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమీషనర్ నసీం జైదీ తెలియజేశారు.