రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి బుధవారం ఒక రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకొన్నారు. వారిరువురూ నిన్న కీసరలో మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్నప్పుడు దారిలో ఔటర్ రింగ్ రోడ్డుపై యాద్గార్ పల్లి డి.ఆర్.డి.ఎ.సమీపంలో వారి కారును రోడ్డు పక్కకు తీసుకువెళ్ళి ఆపుతున్నప్పుడు, వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ దానిని బలంగా డ్డీ కొట్టింది.
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో అందరూ క్షేమంగా బయటపడ్డారు. వారితో కలిసి ప్రయాణిస్తున్న మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డికి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. మంత్రి తలసానికి, ఎంపి మల్లారెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. సుధీర్ రెడ్డికి స్థానిక ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స చేయించిన తరువాత మళ్ళీ అందరూ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం మేడ్చల్ మల్కాజాగిరి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయానికి మంత్రి తలసాని శంఖుస్థాపన చేశారు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకొని, డ్రైవరు రవీందర్ సింగ్, క్లీనరును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.