ఒక్కప్పుడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎప్పుడూ విద్యుత్ కోతలే. ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు పంటలకు ‘క్రాప్ హాలీడేస్’, పరిశ్రమలకు ‘పవర్ హాలీడేస్’ అని నిర్లజ్జగా క్యాలెండర్ కూడా ప్రకటిస్తుండేది. ప్రజలు కూడా విద్యుత్ కోతలకు ఎంతగా అలవాటు పడిపోయారంటే, ‘తగినంత విద్యుత్ ఉత్పతి లేనప్పుడు ప్రభుత్వం మాత్రం ఏమి చేయగలదు? వేసవిలో విద్యుత్ కోతలు సహజమే..” అని అంగీకరించే స్థితికి వచ్చేశారు. కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత, అశ్రద్ధ కారణంగా ఏర్పడిన సమస్య అని ఎవరూ భావించలేదు..ప్రభుత్వాన్ని నిందించలేదు. పాపం రైతన్నలు..భూమిలో నీళ్ళున్నప్పటికీ వాటిని తోడుకొనేందుకు విద్యుత్ లేకపోవడంతో తమ కళ్ళ ముందే ఎండిపోతున్న పంటలను చూసి తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిరాశనిస్ప్రుహాలతో కుమిలిపోతూ ఆత్మహత్యలు చేసుకొనేవారు.
పవర్ హాలీడేస్ కారణంగా అనేక చిన్న, మద్యతరగతి పరిశ్రమలు తీవ్రనష్టాలలో కూరుకుపోయి చివరికి మూతపడ్డాయి. ఆ కారణంగా అనేక వేలమంది కార్మికులు రోడ్డునపడ్డారు.
ఈ విద్యుత్ కోతలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు..అన్నిటినీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రదండం త్రిప్పి మాయం చేసినట్లు కొన్ని నెలల వ్యవధిలోనే మాయం చేసేశారు. మున్ముందు రోజుల్లో కరెంట్ పోతేనే వార్తవుతుందని కేసీఆర్ చెప్పిన మాటలు నిజమయ్యాయి.
ఇప్పుడు తెలంగాణాలో దాదాపు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోంది. అయితే నేటికీ చిన్న పట్టణాలలో, గ్రామాలలో 24 గంటలు విద్యుత్ సరఫరా జరుగడం లేదు. కానీ వచ్చే ఫిబ్రవరి నెల నుంచి రాష్ట్రంలో అన్ని గ్రామాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్ కో, జెన్కో సిఎండీ ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలలో ప్రయోగాత్మకంగా వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఫిబ్రవరి నుంచి అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభాకర్ రావు తెలిపారు. దానికోసం తమ శాఖా చేస్తున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన వివరించారు. దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.