ఈరోజు సిరిసిల్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్, అపేరల్ పార్క్ మొదలైనవాటికి శంఖుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో సిరిసిల్ల ఎమ్మెల్యే మరియు రాష్ట్ర చేనేతశాఖ మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, “సిరిసిల్లను జిల్లాగా చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సభాముఖంగా మరొకమారు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఆయన వివాహం వేములవాడలోనే జరిగింది. కొదురుపాక అల్లుడైన అయనకు సిరిసిల్ల జిల్లాతో బలమైన అనుబంధం ఉంది కనుక ఆయనకు జిల్లా సమస్యలు, అవసరాలు, ఉపాధి అవకాశాల గురించి కొత్తగా మనం చెప్పనవసరం లేదు. జిల్లా అభివృద్ధి కోసం, నేతన్నల సంక్షేమం కోసం ఆయన అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. ఆయన రైతు, నేతన్న, కార్మిక పక్షపాతి.
వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో రైతన్నలందరికీ ఏడాదికి రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8,000 ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే నేతన్నల సంక్షేమం కోసం రూ.1,283 కోట్లు కేటాయించారు. సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఆయన అమలుచేస్తున్న ఈ కార్యక్రమాలన్నిటినీ మీరే స్వయంగా చూస్తూన్నారు. మన జిల్లాలో ఉద్యోగులు, అధికారులు, ప్రభుత్వం అందరూ సమన్వయంతో కలిసి పనిచేసుకొంటూ జిల్లాను ఇంకా అభివృద్ధి చేసుకొందాము. జిల్లా అభివృద్ధికి, నేతన్నల సంక్షేమం కోసం మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రిగారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని మంత్రి కేటిఆర్ అన్నారు.