ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సిద్ధిపేటలో సమీకృత కలెక్టర్ కార్యాలయం, పోలీస్ కార్యాలయాలకు శంఖుస్థాపనలు చేసిన తరువాత సిరిసిల్లలో కలెక్టర్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం, అపెరల్ పార్క్, గ్రూప్ వర్క్-షాప్ లకు వరుసగా శంఖుస్థాపనలు చేశారు.
అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, “ఒకప్పుడు రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాలకంటే వెనుకబడి ఉండే సిరిసిల్ల అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు జిల్లా కేంద్రంగా మార్పు చెందడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఇక్కడకు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా నేతన్నల ఆత్మహత్యల గురించే మాటలు వినబడేవి. అవి విని చాలా బాధపదేవాడిని. కానీ ఈ మూడేళ్ళలోనే సిరిసిల్ల లో ఎన్ని మార్పులు వచ్చాయో మీరందరూ చూశారు. నేతన్నల కోసం ఏమేమి చేయగలమో అవన్నీ చేసి మీ సమస్యల ఊబిలో నుంచి బయటకులాగి, అందరూ హాయిగా జీవించేలా చేయాలన్నదే నా అభిమతం. అందుకే దేశంలో మరెక్కడా లేనివిధంగా నేతన్నలకు నెలకు రూ.1,000 పెన్షన్ ఇస్తున్నాము. మీకు అవసరమైన వివిధ రకాల ముడిసరుకులపై 50శాతం సబ్సీడీ ఇస్తున్నాము. మీకు, పవర్ లూమ్ కార్మికులకు నిరంతరంగా పని కల్పించి, ఆదాయం సమకూర్చాలనే మంచి ఉద్దేశ్యం బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇచ్చాము. కానీ దానిపై కూడా ప్రతిపక్షాలు నానా రాద్దాంతం చేయడం మీరే చూశారు. వారికి మీరే తగినవిధంగా బుద్ధి చెప్పాలి. వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన బట్టలను కూడా మీ నుంచే కొనుగోలు చేయడానికి మావాడు (కేటిఆర్) చాలా ప్రణాళికలు సిద్దం చేశాడు. ఆయనకు సిరిసిల్ల నీళ్ళు బాగా వంటబట్టినట్లున్నాయి. మొదట సిరిసిల్లను జిల్లా చేస్తే చాలని చెప్పి ఇప్పుడు రూ.250-300 కోట్లు ఇమ్మని అడుగుతున్నాడు. ఏమైనప్పటికీ సిరిసిల్లను ఇంత వేగంగా అభివృద్ధి చేస్తున్నాడు కనుక జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు తప్పకుండా ఇస్తాను. జిల్లాలో రెండు ఎత్తిపోతల పధకాలకు రూ. 130 కోట్లు మంజూరు చేస్తూ రేపే ఉత్తర్వులు జారీ చేస్తాను,” అని కేసీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పధకాల గురించి వివరించి, ప్రతిపక్షాల నుంచి తాము ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వివరించారు.