ఈరోజు మధ్యాహ్నం సిద్ధిపేటలో సమీకృత కలెక్టర్ కార్యాలయానికి శంఖుస్థాపన చేయడానికి రోడ్డు మార్గంలో బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ దారిలో ములుగు జంక్షన్ వద్ద హటాత్తుగా తన కాన్వాయ్ ని ఆపించడంతో ఆయన భద్రతా సిబ్బందితో సహా అందరూ కంగారుపడ్డారు. ఆయనకేమీ కాలేదు..అక్కడ రోడ్డు పక్కనే నిలబడి ఉన్న తన ఇద్దరు బాల్యమిత్రులు జహంగీర్, అంజిరెడ్డిలను చూసి ఆయన కారు ఆపించారు. వారిని పిలిచి మాట్లాడి తన కారులోనే ఎక్కించుకొని సిద్ధిపేటకు తీసుకువెళ్ళారు. అది చూసి వారితో సహా ఆయన వెనుకే ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, భద్రతాధికారులు అందరూ ఆశ్చర్యపోయారు. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా దక్కని అటువంటి అపూర్వమైన గౌరవం తమ గ్రామస్తులకు దక్కినందుకు ములుగు గ్రామ ప్రజలు ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోయారు.
ఇక సిద్ధిపేటలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు విని అక్కడి ప్రజలు, అయనకు విద్య నేర్పిన గురువులు ఆనందంతో పొంగిపోయారు. “తెలంగాణాకు గుండె కాయ వంటిది సిద్ధిపేట. ఉద్యమాలకు గళాన్ని ఇచ్చింది సిద్ధిపేట. నాకు రాజకీయంగా జన్మనిచ్చింది సిద్ధిపేట. ఈ గడ్డకు, ఇక్కడి ప్రజలకు నేనెప్పుడు రుణపడిఉంటాను. ఒకప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేను సిద్ధిపేటను జిల్లాగా ప్రకటించాలని ఆయనకు వినతి పత్రం ఇచ్చాను. కానీ కాలేదు. కానీ తరువాత అందరం కలిసి పోరాడి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకొన్నాము. ఇప్పుడు సిద్ధిపేట జిల్లాను కూడా ఏర్పాటు చేసుకొన్నాము. నా గురువుల దయతో ఈ మట్టిలో మొలిచిన మొక్కను నేను. ఇవన్నీ నేను బ్రతికి ఉండగానే నా కళ్ళతో నేను చూడగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జన్మకు ఇంతకంటే ఏమి కావాలి నాకు?” అని కేసీఆర్ అన్నప్పుడు సిద్ధిపేట ప్రజలు చప్పట్లతో హోరెత్తించేశారు.
తన రాజకీయ ప్రత్యర్ధులపై సింహంలా గర్జిస్తూ చీల్చి చెండాడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తనలో దాగిఉన్న మానవీయకోణాన్ని చూపడం విశేషం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ పుట్టినగడ్డను, చిన్ననాటి స్నేహితులను, అక్కడి తన మనుషులను మరిచిపోకుండా పేరుపేరునా గుర్తుచేసుకొని, నేటి తన ఈ స్థితికి కారకులు మీరేనని చెప్పుకొని కేసీఆర్ తన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని మరొకసారి అందరికీ కళ్ళకు కట్టినట్లు చూపారు. దటీజ్ కేసీఆర్!