కలెక్టర్ కార్యాలయాలకు నేడు శంఖుస్థాపనలు

తెలంగాణాలో కొత్త జిల్లాలు ఏర్పడి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. మొత్తం 31 జిల్లాలలో హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన అన్ని జిల్లాలలో కొత్తగా కలెక్టర్ కార్యాలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒక్కో జిల్లాలో 25 ఎకరాల విస్తీర్ణంలో జిల్లాకు సంబందించిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో కూడిన సమీకృత కలెక్టర్ కార్యాలయాలను నిర్మించడానికి అవసరమైన భూసేకరణ, నిధుల కేటాయింపు, వాటికి ప్లాన్స్ గీయించడం వగైరా కార్యక్రమాలన్నీ పూర్తవడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు సమీకృత కలెక్టర్ కార్యాలయాల నిర్మాణానికి శంఖుస్థాపనలు చేస్తున్నారు.

నాగర్ కర్నూల్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వికారాబాద్ లో మంత్రి మహేందర్ రెడ్డి, ఆసిఫాబాద్ కుమ్రుం భీమ్ లో మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి శంఖుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే సిద్ధిపేటలో శంఖుస్థాపన చేశారు. 

అన్ని జిల్లాలలో ఈ సమీకృత కార్యాలయాలు 12 నెలల వ్యవధిలో నిర్మించి, అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే స్పష్టం చేశారు. కనుక త్వరలోనే టెండర్లు ఖరారు చేసి నిర్మాణపనులు మొదలుపెట్టబోతున్నారు. వీటికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే సిద్దం చేసి ఉంచింది కనుక ఇక నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టడమే ఆలస్యం.