దేశవ్యాప్తంగా అన్ని వస్తువులు, అన్ని సేవలను జి.ఎస్.టి.పరిధిలోకి తీసుకువచ్చినప్పటికీ పెట్రోల్, డీజిల్ ను మాత్రం దాని పరిధిలోకి తేకుండా వాటిపై నేటికీ వ్యాట్ పన్ను వసూలు చేస్తుండటాన్ని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా తప్పు పడుతున్నాయి. ఆ కారణంగా కేంద్రప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ పన్ను 2 శాతం తగ్గించడంతో వాటి ధరలు కొద్దిగా తగ్గాయి. అయినా వాటి ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయనే సంగతి ప్రభుత్వానికి కూడా తెలుసు.
వచ్చే ఏడాది సెప్టెంబర్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని భావిస్తున్న కేంద్రప్రభుత్వం, ఇప్పటి నుంచే మెల్లగా ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బహుశః ఆ ప్రయత్నాలలో భాగంగానే పెట్రోల్, డీజిల్ పై వసూలు చేస్తున్న వ్యాట్ పన్నును తగ్గించుకోవాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను కోరింది. మొట్టమొదటగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్పందిస్తూ వాటిపై 4 శాతం వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.2.93, రూ.2.72 తగ్గుతాయి.
మరో భాజపా పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ కూడా సానుకూలంగా స్పందించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్ ప్రజలకు దీపావళి కానుకగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించబోతున్నట్లు ప్రకటించారు. ఇక మహారాష్ట్రలో భాజపా సర్కార్ కూడా అదే బాటలో పయనించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. యూపి, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, గోవా తదితర భాజపా పాలిత రాష్ట్రాలు కూడా బహుశః అదే బాటలో నడువవచ్చు. ఆ కారణంగా మిగిలిన రాష్ట్రాలలో కూడా డీజిల్, పెట్రోల్ పై వ్యాట్ తగ్గించక తప్పనిసరికావచ్చు. ఇంతకాలం రోజువారీగా ఇష్టం వచ్చినట్లు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుకొంటూపోతూ సామాన్యుల నడ్డి విరగదీసిన ప్రభుత్వాలకు ఎన్నికలు దగ్గర పడితేగానీ వారి కష్టాలు కనబడవని ఇది స్పష్టం చేస్తోంది.