ఒకప్పుడు పిల్లలకు వానావానా వల్లప్ప..అంటూ వానలను ఆహ్వానిస్తూ పాటలు పాడుకొనేవారిమీ. కానీ ఇంగ్లీష్ మీడియా చదువులు వచ్చిన తరువాత ‘రెయిన్..రెయిన్..గో ఎవే..’ అని పాడుకొంటున్నాము. ఇప్పుడు హైదరాబాద్ ను ముంచుత్తుతున్న వర్షాలను చూసి బెంబేలెత్తిపోతున్న నగరవాసులు, అధికారులు అందరూ కూడా ముక్తకంఠంతో ‘రెయిన్..రెయిన్..గో ఎవే..’ అని కోరస్ పాడుతున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలు అందరినీ అంతగా భయపెడుతున్నాయి.
మళ్ళీ సోమవారం రాత్రి నగరంలో కుండపోతగా వర్షంపడటంతో నగరంలో అనేక ప్రధానరహదార్లు ఆ నేతిలో కనబడకుండా మాయం అయిపోయాయి. యధాప్రకారం కాలనీలలోకి..అపార్ట్మెంట్ సెల్లార్లలోకి, పేదల ఇళ్ళలోకి నీళ్ళు చేరదాంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా రోడ్లపై నీళ్ళే..వాటిలో పడవలు వేసుకొని వివిధ శాఖల సిబ్బంది తిరుగుతుంటే హైదరాబాద్ వెనీస్ నగరాన్ని తలపింపజేస్తోంది అంటే అతిశయోక్తికాదు. రోడ్లపై వాహనాలు తిరగడానికి అవకాశం లేకుండా ప్రవహిస్తున్న ఆ నీటిని చూస్తుంటే ఇకపై నగరంలో ప్రజలు కార్లు, ద్విచక్రవాహనాలతోబాటు పడవలు కూడా కొనిపెట్టుకొంటే మంచిదేమో అనిపిస్తోంది.
నగరంలో నిన్న రాత్రి కురిసిన వానలకు మొహిదీపట్నం, పాతబస్తీ, పంజాగుట్ట, రాజేంద్ర నగర్, తిరుమలగిరి, మాదాపూర్, కాటేదాన్, బండ్లగూడ ఇంకా అనేక ప్రాంతాలలో రోడ్లు జలమయం అయ్యాయి. దాదాపు అన్ని ప్రాంతాలలో నాలాలు పొంగిప్రవహిస్తున్నాయి.
నగరంలో వివిధ ప్రాంతాలలో నిన్న రాత్రి 4 నుంచి 7.3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదు అయ్యాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కుండపోతగా కురుస్తున్న ఆ వనలను చూస్తుంటే హైదరాబాద్ నగరం మీద వరుణుడు పగబట్టాడా? అని అనుమానం కలుగుతోంది.
అయితే, గతంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు జి.హెచ్.ఎం.సి., ట్రాఫిక్, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖలలో నిర్లిప్తంగా వ్యవహరించేవి కానీ ఇప్పుడు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సహా సిబ్బంది అంత వర్షంలోను రోడ్లపైనే కనిపిస్తున్నారు. రేయింబవళ్ళు పనిచేస్తూ బారీ వర్షాల కారణంగా ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నాలు చేస్తుండటం చాలా అభినందనీయం. అయితే ప్రకృతి ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నప్పుడు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనబడటం లేదు. కనుక నగరంలో ప్రజలు, స్వచ్చంద సంస్థలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు వారికి అన్నివిధాల సహాయసహకారాలు అందించాల్సిన సమయం ఇది.