అదిలాబాద్ తెరాస ఎంపి జి.నగేష్ కు జిల్లా ఎస్పి శ్రీనివాస్ చురకలు వేయడం విశేషం. నెలరోజుల క్రిందట ఎంపి ఇంట్లో దొంగలుపడి విలువైన ఆభరణాలు దోచుకుపోయారు. ఆ సంఘటన జరిగినప్పుడు జిల్లా ఎస్పి శ్రీనివాస్ ఏమాత్రం పట్టించుకోలేదని, ఇంతవరకు ఒక్కసారైనా తనకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదని, పోలీసుల వైఫల్యం వల్లనే దొంగతనం జరిగిందని ఆరోపించారు. “ఒక ఎంపి ఇంట్లోనే దొంగలుపడి దోచుకుపోయినా పోలీసులు సకాలంలో స్పందించలేదు. ఇంతవరకు దొంగలను పట్టుకోలేకపోయారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?” అని ఎంపి నగేష్ కొన్ని రోజుల క్రితం ప్రశ్నించారు.
ఆయన వ్యాఖ్యలపై జిల్లా ఎస్పి శ్రీనివాస్ కూడా తీవ్రంగా స్పందించారు. “ఎంపిగా ఉన్న వ్యక్తి వీలైతే సహకరించాలి తప్ప కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసుల మనోస్తైర్యం దెబ్బతినేవిధంగా మాట్లాడటం సరికాదు. ఈ కేసు విషయంలో మా ప్రయత్నలోపం లేకుండా దర్యాప్తు జరిపి నిందితులను అదుపులోకి తీసుకొన్నాము. వారి వద్ద నుంచి సుమారు 12.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని విచారిస్తున్నాము. ఇంత చేసినా ఇంకా మేము వైఫల్యం చెందామని ఎంపిగారు ఆరోపించడం సరికాదు. ఒకవేళ నేను వైఫల్యం చెందానని ఆయన భావిస్తే నిరభ్యంతరంగా నన్ను వేరే చోటికి బదిలీ చేయించవచ్చు. ఎక్కడికి బదిలీ చేసినా వెళ్ళిపోవడానికి నేను సిద్దం,” అని ఎస్పి శ్రీనివాస్ అన్నారు.
ఈరోజు ఉదయం ఎస్పి శ్రీనివాస్ సమక్షంలోనే ఈ దొంగతనానికి పాల్పడిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకొన్న ఆభరణాలను కూడా మీడియాకు చూపారు.