ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తీవ్రవిమర్శల కారణంగా అధికార, ప్రతిపక్షాల నేతల మద్య మళ్ళీ యుద్ధం ప్రారంభం అయ్యింది. మళ్ళీ ఏదో ఆసక్తికరమైన రాజకీయపరిణామం జరిగేవరకు బహుశః మరికొన్ని రోజులపాటు వారి మద్య ఈ యుద్దాలు కొనసాగవచ్చు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలను, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి గట్టిగా ఖండించారు. చనిపోయిన నెహ్రు, ఇందిరా గాంధీల గురించి, తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురించి కేసీఆర్ చాలా అనుచితంగా మాట్లాడారని అన్నారు. సోనియా గాంధీ తలుచుకోబట్టే తెలంగాణా వచ్చిందని దని కోసం ఆమె ఏపిలోని తన పార్టీని సైతం పణంగా పెట్టారని అటువంటి వ్యక్తి గురించి కేసీఆర్ చాలా తప్పుగా మాట్లాడారని అన్నారు. కేసీఆర్ బాష, మాటలు రెండూ చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవ్యక్తికి అవి తగవని అన్నారు.
తాము కూడా ఒకమెట్టు దిగడానికి సిద్దపడితే కేసీఆర్ గురించి చాలా విషయాలు బయట పెట్టగలమని జానారెడ్డి అన్నారు. తెలంగాణా సాధనలో కేసీఆర్ తమ సహాయసహకారాలు తీసుకోకుండానే రాష్ట్రాన్ని సాధించారా? అని జానారెడ్డి ప్రశ్నించారు. సింగరేణి ఎన్నికలలో గెలిచి ఏదో గొప్ప ఘనకార్యం సాధించినట్లు కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని అది సరికాదని అన్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెరాసను ఓడించి అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు.
జానారెడ్డి మాటలపై తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ కూడా ధీటుగా స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు అక్షరాల నిజమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తెలంగాణా గురించి ఆలోచించలేదు...ఇప్పటికీ ఆలోచించడం లేదు. పైగా అడుగడుగునా మాకు అడ్డుపడుతూనే ఉంది.
సింగరేణి ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు మా ప్రభుత్వంపై ఎంతగా దుష్ప్రచారం చేసినప్పటికీ వారు నమ్మలేదు. మమ్మల్ని ఓడించడానికి బద్దవిరోధులైన ప్రతిపక్షాలన్నీ చేతులు కలిపాయి. సింగరేణి ఎన్నికలతో మా పతనం మొదలవుతుందని ప్రగల్భాలు పలికి ఉత్తం కుమార్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాస్తవానికి సింగరేణి ఎన్నికలతోనే ప్రతిపక్షాల పతనం మొదలైంది.
మా గురించి జానారెడ్డి ఏదో చెప్పాలనుకొంటే ఆయనను అడ్డుకొనేవారెవరు? నిర్భయంగా బయటపెట్టవచ్చు కదా?” అని కర్నే ప్రభాకర్ అన్నారు.
ఇటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళ వలన తెరాసకు ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో కానీ ప్రతిపక్షాలు ఏమీ ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక సింగరేణి ఎన్నికలను ఒక గుణపాఠంగా భావించి, నానాటికీ బలపడుతున్న తెరాసను వచ్చే ఎన్నికలలో ఏవిధంగా డ్డీకొనాలని ఆలోచనలు చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. అలాగే తమ బలాబలాను, బలహీనతలను కూడా సరిగ్గా అంచనా వేసుకొని అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకొంటే మంచిది. ఎందుకంటే, త్వరలో అవి నల్లగొండ లోక్ సభ ఉపఎన్నికలలో మళ్ళీ తెరాసను ఎదుర్కోవలసి ఉంటుంది.