గోద్రా కేసుపై కోర్టు తీర్పు వెలువడింది

ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోద్రా కేసులో ఈరోజు గుజరాత్ హైకోర్టు తుది తీర్పు ప్రకటించింది. సుమారు 15 ఏళ్ళ క్రితం అంటే 2002, ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా స్టేషన్ బయట సబర్మతి ఎక్స్‌ప్రెస్ నిలిచిఉన్నప్పుడు దానిలో ఎస్-6 బోగీలోపల ప్రయాణికులు ఉండగానే తలుపులు బంధించి కొందరు దుండగులు బోగీకి నిప్పు పెట్టారు. ఆ ఘటనలో బోగీలో ఉన్న 59 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అప్పటి నుంచి ఆ కేసు విచారణ జరుగుతూనే ఉంది. 

ఆ ఘటనలో మొత్తం 31మందిని దోషులుగా ప్రకటించి వారిలో 11 మందికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విదించింది. అయితే మరణశిక్ష పడినవారు కోర్టులో అప్పీలు చేసుకోవడంతో ఇన్నేళ్ళుగా ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. చివరికి ఘటన జరిగిన 15 ఏళ్ళ తరువాత ఈరోజు గుజరాత్ హైకోర్టు ఆ 11 మంది మరణశిక్షలను కూడా జీవితఖైదుగా మార్చుతూ తీర్పు చెప్పింది. ఆ సమయంలో గుజరాత్ లో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో ఆనాటి ప్రభుత్వం (మోడీ సర్కార్) విఫలమైందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.