ప్రముఖ తెలుగు సినీనటుడు డాక్టర్ రాజశేఖర్ నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. అయన చెన్నైలో తన తల్లి అంత్యక్రియలు పూర్తిచేసి నిన్న రాత్రి విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకొన్నారు. అక్కడి నుంచి ఆయన తన కారును తానే డ్రైవ్ చేసుకొంటూ వస్తుండగా రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పివిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవేపై తన ముందు వెళుతున్న రామిరెడ్డి అనే వ్యక్తి వాహనాన్ని పొరపాటున డ్డీకొన్నారు. ఆ ప్రమాదంలో ఆయనకు స్వల్పగాయాలు అయ్యాయి. ఆ సమయంలో ఆయన మద్యం త్రాగి డ్రైవ్ చేస్తున్నారని రామిరెడ్డి పోలీసులకు పిర్యాదు చేయడంతో వెంటనే వారు అక్కడకి చేరుకొని బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసి ఆయన మద్యం తాగలేదని నిర్ధారించారు. ఈ సంగతి తెలుసుకొన్న ఆయన భార్య జీవిత అక్కడకు చేరుకొని, తల్లి మరణించిన బాధతో ఉన్న తన భర్త పొరపాటున గుద్దారని చెప్పడంతో రామిరెడ్డి తన కేసును వెనక్కు తీసుకొంటున్నట్లు పోలీసులకు తెలిపారు. అనంతరం ఆమెతో కలిసి డాక్టర్ రాజశేఖర్ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి తన గాయాలకు చికిత్స తీసుకొన్నారు.
అయితే ఈ విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా అలవాటు ప్రకారం కాస్త అతి ప్రదర్శించడం బాధాకరం. ఈ విషయం తెలియగానే అక్కడకు చేరుకొని అక్కడ జరిగిన సంఘటనలో డాక్టర్ రాజశేఖర్ దోషి అన్నట్లుగా చూపించడం, అక్కడకు చేరుకొన్న ఆయన భార్య జీవితను లైవ్ లో చూపిస్తూ వార్తా కధనాలు ప్రసారం చేయడం బాధాకరం. దేశంలో ఇటువంటి కారు ప్రమాద ఘటనలు రోజూ కొన్ని వందలు జరుగుతుంటాయి. ఇది కూడా అటువంటిదే. ఈ ఘటనలో డాక్టర్ రాజశేఖర్ దే పొరపాటు అయినప్పటికీ, అయన సెలబ్రిటీ కనుక స్పైసీ న్యూస్ అందించడం కోసం ఆయన ప్రతిష్టకు, కుటుంబ గౌరవానికి భంగం కలిగేవిధంగా కవరేజ్ ఇవ్వాలనుకోవడం చాలా శోచనీయం.