సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో టిబిజికెఎస్ ను గెలిపించినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో సింగరేణి కార్మికులతో ఆత్మీయసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడారు.
“ఇంతకాలం నేను వేరే పనుల ఒత్తిడి కారణం చేత మిమ్మల్ని పట్టించుకోలేకపోయినందుకు నన్ను క్షమించాలి. ఇక నుంచి సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం చేయగలిగినంతా నేను చేస్తాను. మరో మూడు వారాలలో సింగరేణికి వచ్చి మీ ఇళ్ళు, ఆసుపత్రి వగైరాలను నేనే స్వయంగా పరిశీలిస్తాను. సింగరేణి ఆసుపత్రిలోనే నేనే బిపి చెక్ చేయించుకొంటాను. అక్కడ మీకు ఇబ్బందులు సృష్టిస్తున్న అధికారులు అందరినీ తొలగిస్తాను. అలాగే ఇతర శాఖల నుంచి సింగరేణికి వచ్చి అక్కడే స్థిరపడిన వారిని వెనక్కు పంపిస్తాను. మీకు వైద్యం చేయింకోవాలన్నా, క్వార్టర్ మారాలనుకొన్నా, ఏవైనా మెడికల్ సర్టిఫికెట్స్ కావాలన్నా లంచాలు అడిగే అధికారులను చెప్పుతో కొట్టండి. ఈ ఎన్నికలలో గెలిచింది కేవలం టిబిజికెఎస్ మాత్రమే కాదు... సింగరేణి కార్మికులు అందరూ గెలిచారు. సింగరేణిలో ఏ సంఘానికి చెందిన కార్మికులైనా అందరూ నా బిడ్డలవంటివారే. మీ అందరికీ మేలు కలిగేవిధంగా సింగరేణిని సమూలంగా ప్రక్షాళన చేసి చూపిస్తాను,” అని కేసీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణికి, కార్మికులకు అనేక వరాలు ప్రకటించారు. ఆ వివరాలు క్లుప్తంగా:
1. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 51 శాతం వాటా ఉంది. దానిలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే సొమ్ములో రూ.50 కోట్లు తగ్గించుకొని దానితో సింగరేణి కార్మికులకు ఇళ్ళు నిర్మించుకోవడానికి వడ్డీలేని రుణం ఇస్తాము.
2. సింగరేణి కార్మికులు స్వంత ఇళ్ళు నిర్మించుకోవడానికి ఇదివరకు రూ.6 లక్షలు వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పాము. దానిని రూ.10 లక్షలకు పెంచుతున్నాము.
3. సింగరేణి పర్యటనకు వచ్చినప్పుడు కొత్తగా 8 గనులను ప్రారంభిస్తాను. వాటి ఏర్పాటుతో మరో 8,000 కార్మికులకు ఉద్యోగాలు లభిస్తాయి.
4. సీనియర్ కార్మికులకు ఓపెన్ కాస్ట్ గనులలో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తాము.
5. బయ్యారం ఉక్కు గనిని సింగరేణికి అప్పగిస్తాము.
6. కోల్-ఇండియాలో తరహాలోనే సింగరేణిలో కూడా క్యాడర్ స్కీమ్ అమలు చేస్తాం.
7. వేరే పేర్లతో ఉన్న 2,750 మందికి ఏడు రోజులలో క్రమబద్ధీకరణ చేస్తాం.
8. వారసత్వ ఉద్యోగాల స్థానంలో కారుణ్యనియామకాలను చేపడతాము. ఎవరైనా కార్మికులు ఆ ఉద్యోగాలు వద్దనుకొని పదవీ విరమణ తీసుకోదలిస్తే వారికి ఏకమొత్తంలో రూ.25 లక్షలు ఇస్తాం.
9. బదిలీ ఫిలర్లను పర్మినెంట్ చేసేందుకు ప్రస్తుతం ఉన్న 190 రోజుల కాలపరిమితి తగ్గిస్తాం.
10. సింగరేణి కార్మికుల పిల్లలకు ఐఐటి, ఐఐఎంలలో చదువుకోవడానికి సీట్లు వస్తే వారి ఫీజులన్నీ సింగరేణి సంస్థే భరిస్తుంది.
11.సింగరేణి కార్మిక సంఘాలలో సభ్యత్వ రుసుము (ప్రస్తుతం నెలకు రూ.20)ను నెలకు ఒక్క రూపాయి మాత్రమే ఉండేలా సంఘం నియమావళిలో మార్పులు చేస్తాం.
12.సింగరేణి ఆసుపత్రి పాలక మండలిని, అవినీతి అధికారులను తొలగించి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేస్తాం. తరువాత దానిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తాము. సింగరేణి కార్మికుల తల్లి తండ్రులకు కూడా రిఫరెల్ సౌకర్యం కల్పిస్తాం.
13.అంబేద్కర్ జయంతి రోజు కార్మికులకు అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తాం.
14.కార్మికుల క్వార్టర్లకు రిపేర్లు చేయించి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
15. సింగరేణి కార్మికులు ఇళ్ళలో ఏసీలు పెట్టించుకోవడానికి ఏర్పాట్లు చేసి దానికి ఉచిత విద్యుత్ అందిస్తాం.
16. కార్మికుల క్యాంటీన్లలో తినుబండారాల పెంచుతాం.