ఇటీవల తెదేపా మంత్రులు జనసేన, దాని అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తుండటంతో అయన అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ తాజా అవాంఛనీయ పరిణామాలపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు, జనసేన కార్యకర్తలను సంయమనం పాటించవలసిందిగా ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆయన ఏమని ట్వీట్ చేశారంటే, “జనసేన శ్రేణులు, అభిమానులకు ఒక విన్నపం. మనం పార్టీ నిర్మాణంలో ఆచరణాత్మకంగా అడుగులు వేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ముందుకు వెళుతున్నాం. ఈ తరుణంలో కొందరు పేరు కోసమో.. మన దృష్టిని మరల్చడానికో.. మనల్ని చికాకు పర్చడానికో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటివాటిపై మీరెవ్వరూ స్పందించవద్దని మనవి చేస్తున్నాను. వ్యక్తిగతంగా నాపై విమర్శలు చేసినా.. నాకు అపకీర్తి వచ్చేలా మాట్లాడినా మనం హుందాగానే ప్రవర్తిదిద్దాం. ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా, బాధ్యతాయుతమైన రాజకీయ వ్యవస్థ ఆవిష్కరానికి జనసేన దృఢ నిశ్చయంతో ముందుకెళుతున్న విషయం మీ అందరికీ విదితమే.
కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు పరిఢవిల్లాలని బలంగా నమ్మడమే కాదు.. ఆచరణలో చూపాలన్న నా దృఢ సంకల్పంతో ఆవిర్భవించిందే జనసేన పార్టీ. మానవత్వమే మతంగా, సమాజ హితమే అభిమతంగా రూపుదిద్దుకుంటోంది జనసేన.
యువత భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకు విశాల దృక్పథం కలిగిన రాజకీయాలు చాలా అవసరమని జనసేన విశ్వసిస్తోంది. ఇటువంటి తరుణంలో మనపై వచ్చే కువిమర్శలపై మీరు ఆవేశం చెందకండి. మీ ఆవేశం పార్టీకి మేలు చేయకపోగా ఒక్కోసారి హాని చేయవచ్చు. మనపై చేస్తున్న ప్రతి కువిమర్శను పార్టీ లెక్కగడుతూనే ఉంది. అవి హద్దులు మీరుతున్నప్పుడు సమయం, సందర్భం చూసి పార్టీ స్పందిస్తుంది. అంతవరకు మీరు ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్లండి. హుందాగా పార్టీ కోసం పనిచేయండి. ఓర్పే మన పార్టీకి రక్ష’ అని ట్వీట్ చేశారు.