ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న గంటన్నరసేపు ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోశారు కనుక నేడు ప్రతిపక్షాలవంతు. సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “సింగరేణి ఎన్నికలలో గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ వరల్డ్ కప్ గెలిచినట్లు ఫీలైపోతున్నారు. సింగరేణి ఎన్నికలలో తన కూతురును గెలిపించుకోవడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డి మరీ గెలిపించుకొన్నారు. ఇక తెలంగాణా ఉద్యమాలలో ఒకానొక సమయంలో కేసీఆర్ డీలాపడిపోతే ప్రొఫెసర్ కోదండరామ్ కాదా మళ్ళీ ఆయన భుజం తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించింది? ఆ సంగతి మరిచిపోయి ఆయన గురించి కేసీఆర్ అంతచులకనగా మాట్లాడటం తగదు. ఒకవేళ ఉత్తం కుమార్ రెడ్డిలో నిజంగా దొర లక్షణాలు ఉన్నట్లయితే సైన్యంలో (వాయుసేనలో పైలట్ గా చేశారు) చేరేవారు కాదు కదా? గత ఎన్నికలలో శ్రీకాంతాచారి తల్లిని ఓడించింది ఎవరు? కేసీఆరే కదా? అని నిలదీశారు. పనిలోపనిగా గవర్నర్ నరసింహన్ పై కూడా హనుమంతరావు నిప్పులు చెరిగారు. ఆయన కేసీఆర్ కు భజన చేస్తూ తెరాస కార్యకర్తలాగ మాట్లాడుతున్నారని విమర్శించారు.
తాజా సమాచారం: తనపై కేసీఆర్ చేసిన తీవ్ర విమర్శలకు ప్రొఫెసర్ కోదండరామ్ ఈరోజు సాయంత్రం 4గంటలకు ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు చెప్పబోతున్నారు.