సింగరేణి ఎన్నికలలో టిబిజికెఎస్ ఘన విజయం సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి ప్రతిపక్షాలను దుమ్ముదులిపేశారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ కూడా చాలా ధీటుగా బదులిచ్చారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, “సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో గెలిచి అదేదో శాసనసభ ఎన్నికలలో గెలిచేసినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడోసారి..అప్పుడోసారి ఒక్కో ఎన్నికలు నిర్వహిస్తూ అక్కడ తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, నేతలందరినీ దింపేసి, విచ్చల విడిగా డబ్బు వెదజల్లుతూ, అధికార దుర్వినియోగం చేసి విజయం సాధిస్తుంటాడు. ఇక తెలంగాణాలో తనంతటోడు లేడని, తెరాసకు తిరుగులేదని ఓ.. చాలా గొప్పలు చెప్పుకొంటుంటాడు. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే, తనపై తనకు అంత నమ్మకముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలందరి చేత ఒకేసారి రాజీనామా చేయించి, ఒకేసారి ఉపఎన్నికలకు రావాలి. అప్పుడు ఎవరి సత్తా ఎంతో తేలిపోతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతలను ఉద్దేశ్యించి సన్నాసులు, బుద్ధిజ్ఞానంలేనోళ్ళు అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడటం అహంకారమే. ఆయనకు ప్రజలే తగినవిధంగా గట్టిగా బుద్ధి చెపుతారు,” అని అరుణ తీవ్రంగా విమర్శించారు.