సింగరేణిలో టిబిజికెఎస్ విజయం సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసారి అయన టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ను నేరుగా.. చాలా ఘాటుగా విమర్శించారు.
తెరాస వ్యతిరేకతే సిద్దాంతంగా చేసుకొని ఆయన పనిచేస్తున్నారని విమర్శించారు. ఆ కారణంగానే తమ ప్రభుత్వం ఏపని చేపట్టినా దానిని గుడ్డిగా వ్యతిరేకించడం, విమర్శించడం చేస్తుంటారని కేసీఆర్ విమర్శించారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏజంటుగా పని చేస్తున్నారని ఆరోపించారు. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని ముంచింది కూడా ఆయనే అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం తెరాసతో పొత్తులకు ప్రయత్నిస్తుంటే ప్రొఫెసర్ కోదండరామ్ సైంధవుడిలాగ అడ్డుపడ్డారని ఆరోపించారు. తెలంగాణా ఇచ్చిన కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదని, కనుక తెరాసతో పొత్తులు పెట్టుకోనవసరం లేదని ప్రొఫెసర్ కోదండరామే సోనియా గాంధీకి నూరిపోశారని ఆరోపించారు. ఆయన మాటలను నమ్మిన కాంగ్రెస్ అధిష్టానం కుక్కతోకపట్టుకొని గోదావరి ఈదినట్లుగా ఎన్నికల బరిలోకి దిగి తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. ఆనాడు తమను ముంచిన ఆయననే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నమ్ముకోవడం విడ్డూరంగా ఉందని కేసీఆర్ అన్నారు.
“అసలు టిజెఎసిని ఏర్పాటు చేసి ఆయనను చైర్మన్ చేసిందే నేను. అలాగే తెలంగాణా విద్యావేత్తల ఫోరంను ఏర్పాటు చేసిందే నేను. వాటి గురించి నాకు తెలియదా?” అని కేసీఆర్ ప్రశ్నించారు. “తెలంగాణా ఉద్యమాల కోసం నేను తయారు చేసిన వేలాది సైనికులలో ఆయన కూడా ఒకరు. నేను దారి చూపిస్తే ముందుకు వెళ్ళిన వ్యక్తే తప్ప ఆయన నాకంటే ఏమీ గొప్పోడు కాడు. అసలు జెఎసిలో ఇప్పుడు ఒక్క రాజకీయ పార్టీ అయినా ఉందా? లేనప్పుడు ఆయన ఇంకా దానిని ఎందుకు కొనసాగిస్తున్నారు? అసలు ఆయన ఏ అధికారంతో మా ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు? ఆయన ఏనాడైన కనీసం సర్పంచ్ గా అయినా చేశాడా? ఆయనకు నిజంగా దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలి. వచ్చి మమ్మల్ని నేరుగా ఎదుర్కొని తన సత్తా చూపించాలి. అంత ధైర్యం ఆయనకు ఉందా?” అని ప్రశ్నించారు.
“ఆ పెద్దమనిషి పనిగట్టుకొని సింగరేణికి వెళ్ళి మా టిబిజికెఎస్ కు ఓటేస్తే సింగరేణి నాశనం అయిపోతుందని చాలా దుష్ప్రచారం చేశాడు. కానీ చివరకు ఏమయింది? సింగరేణి కార్మికులు ఆయన మాటలు నమ్మలేదు. మాపైనే నమ్మకముంచి టిబిజికెఎస్ ను గెలిపించారు. టిజెఎసి, దాని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ముసుగులు తీసి నిలబెట్టవలసిన సమయం వచ్చిందని భావించే ఇదంతా చెపుతున్నాను. ఇకనైనా ఆయన తీరు మార్చుకొంటే ఆయనకే మంచిది,” అని కేసీఆర్ హెచ్చరించారు.